పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉన్నా తన స్క్రీన్ ప్రెసెన్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో మెసేజ్‌ను కలిపి ప్రేక్షకులను మెప్పించడం ప్రతీసారి పవన్ కళ్యాణ్‌కే సాధ్యం. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాలు అన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేని జోనర్లలోనే ఉన్నాయి. కానీ వాటిలో అన్నింటికంటే ఎక్కువగా ఫ్యాన్స్ ఎదురుచూస్తుంది మాత్రం ‘OG’ కోసమే. పవన్ గ్యాంగ్‌స్టర్‌గా చాలా స్టైలిష్‌గా ఉంటాడు. కానీ తన కెరీర్‌లో గ్యాంగ్‌స్టర్ పాత్రలు చేసిన సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘OG’ వచ్చి చేరనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ఓజీ’ నుంచి పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే అప్డేట్ వచ్చేసింది.


ఫైర్ స్ట్రామ్ వచ్చేస్తుంది..
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అయితే, అసలు విషయం ఏమిటనేది మేకర్స్ ప్రకటించలేదు. త్వరలోనే అంటూ అప్‌డేట్ ఇస్తూ ఊరించారు. అయితే, తప్పకుండా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఓజీ’ నుంచి విడుదలైన ఈ స్పెషల్ పోస్టర్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. 






స్టైలిష్ డైరెక్టర్‌పై నమ్మకం..
సుజీత్ దర్శకత్వంతో పవన్ నటిస్తున్నాడు అనగానే ‘పంజా’ లాంటి ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఊహించేసుకున్నారు. ‘పంజా’లో కలకత్తాలో ఉండే గ్యాంగ్‌స్టర్‌గా పవన్ పర్ఫార్మెన్స్, స్టైల్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోయినా.. పవన్ కెరీర్‌లో గ్యాంగ్‌స్టర్ సినిమా అంటే ‘పంజా’నే అని ఫిక్స్ అయిపోయారు. అలాంటి మ్యాజిక్ మళ్లీ ‘ఓజీ’తో రిపీట్ అవుతుంది అని నమ్ముతున్నారు. ఎందుకంటే అది ప్రేక్షకులకు సుజీత్‌పై ఉన్న నమ్మకం. యంగ్ డైరెక్టర్ సుజీత్‌కు సినిమాల అనుభవం చాలా తక్కువ. కానీ తన స్టైలిష్ మేకింగ్‌కు, టేకింగ్‌కు, తన అద్భుతమైన విజన్‌కు స్టార్ హీరోలు సైతం ఫిదా అయిపోతున్నారు. అందుకే అప్పుడు ప్రభాస్.. సుజీత్‌కు ఒక ఛాన్స్ ఇస్తే.. ఇప్పుడు పవన్ కూడా ఈ యంగ్ డైరెక్టర్‌ను నమ్మి అవకాశాన్ని ఇచ్చారు. 


‘ఓజీ’ నుంచి అనౌన్స్‌మెంట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా పక్కా హిట్ అని ఫ్యాన్స్ బలంగా నమ్మడం మొదలుపెట్టారు. ఇక పవన్ ఎన్ని రాజకీయ అంశాలతో బిజీగా ఉన్నా కూడా ఆయన షెడ్యూల్స్‌ను బట్టి ‘ఓజీ’ షూట్‌ను ప్లాన్ చేస్తూ.. దాదాపుగా పూర్తి షూటింగ్‌ను పూర్తి చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ.. ‘ఓజీ’లో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. శ్రియా రెడ్డి లాంటి సీనియర్ నటి కూడా చాలాకాలం తర్వాత ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాతో వెండితెరపై కనిపించనుంది. ఇలా ఇప్పటికే క్యాస్టింగ్‌తో ‘ఓజీ’పై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాడు సుజీత్.


Also Read: ఆలియా భట్ బ్రిటీష్ దేశానికి చెందినదా? అసలు విషయం చెప్పిన ‘RRR’ సీత!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial