కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్లో 'వరుణ్ డాక్టర్', 'డాన్', 'మావీరన్' వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కొల్లగొట్టి విజయ్, అజిత్ వంటి హీరోల తర్వాత స్థానంలో నిలిచి భారీ స్టార్ డం అందుకున్న శివ కార్తికేయన్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. 'రెమో', డాక్టర్', 'డాన్' వంటి సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్ గా వచ్చిన 'మహావీరుడు' సినిమా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది.


అలా కోలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న ఈ హీరో ప్రస్తుతం 'అయాలాన్'(తెలుగులో ఏలియన్) అనే సైన్స్ ఫిక్షన్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ నిర్మాణంలో ఓ ప్రాజెక్టుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరో అగ్ర దర్శకుడితో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు ఏ ఆర్ మురుగదాస్. శివ కార్తికేయన్ తన తదుపరిచిత్రం ఏ.ఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఉండనున్నట్లు స్వయంగా తెలిపాడు. ఈరోజు(సెప్టెంబర్ 25) మురగదాస్ పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం ఆయన్ని స్వయంగా కలిసి విషెస్ తెలిపారు శివ కార్తికేయన్.






ఈ మేరకు తన ట్విట్టర్లో.." డియర్ సార్. హ్యాపీ బర్త్ డే, నా 23వ ప్రాజెక్టు కోసం మీతో కలిసి వర్క్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు చెప్పిన కథ విన్నాక నా ఆనందం రెట్టింపు అయింది. అన్ని విధాలుగా ఈ సినిమా నాకు ప్రత్యేకం కాబోతోంది. షూటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అంటూ రాస్కొచ్చారు. అంతేకాకుండా మురగదాస్ తో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో శివ కార్తికేయన్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


కోలీవుడ్లో 'గజిని', 'తుపాకీ', 'కత్తి' లాంటి ఇండస్ట్రీ హిట్స్ అందించిన మురగదాస్ లాంటి అగ్ర దర్శకుడుతో శివ కార్తికేయన్ సినిమా చేస్తున్నారనే విషయం తెలిసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మురగదాస్ విషయానికి వస్తే.. 2020లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'దర్బార్' అనే సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు మరే చిత్రానికి దర్శకత్వం వహించలేదు. మధ్యలో మన అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేసినా అది వర్కౌట్ కాలేదు.


సుమారు మూడేళ్ల విరామం తర్వాత మురగదాస్ తన తదుపరిచిత్రాన్ని శివ కార్తికేయన్ తో ప్రకటించడం విశేషం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైట్ హౌస్ మూవీస్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషతోపాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మూవీ టీం త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.


Also Read : యాంకర్ సౌమ్య చెప్పుపై చంటీ పంచ్‌లు - అలా చేస్తే నా జడ్జి పోస్ట్ ఎప్పుడో పోయేదన్న కృష్ణ భగవాన్





Join Us on Telegram: https://t.me/abpdesamofficial