Kannappa Movie Scenes Hard Drive Missing: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' టీంకు షాక్ తగిలింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా వాయిదా పడగా.. తాజాగా మరో కొత్త సమస్య వచ్చింది. సినిమాకు సంబంధించి కీలక సీన్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ చోరీకి గురైంది. హార్డ్ డ్రైవ్ తీసుకుని ఆఫీస్ బాయ్ రఘు పారిపోయినట్లు తెలుస్తోంది. విషయం గమనించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ వెనుక ఎవరంటే?
'కన్నప్ప'కు సంబంధించి కీలక హార్డ్ డ్రైవ్‌ను కొందరు సిబ్బంది అనుమతి లేకుండా తీసుకెళ్లారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్‌ను ముంబైలోని ఓ వీఎఫ్ఎక్స్ సంస్థ రూపొందించింది. ఆ డేటాతో కూడిన హార్డ్ డిస్క్‌ను డీటీడీసీ కొరియర్‌లో ఫిలింనగర్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో పని చేస్తోన్న కాంతి అనే వ్యక్తి పేరుతో పంపించారు.
డెలివరీ సంస్థ రికార్డుల ప్రకారం ఈ నెల 25నే హార్డ్ డ్రైవ్ డెలివరీ అయ్యింది. ఆ టైంలో కాంతి అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్ బాయ్ రఘు దాన్ని డెలివరీ తీసుకుని అక్కడే పని చేసే చరిత అనే ఉద్యోగికి దాన్ని అప్పగించినట్లు తెలుస్తోంది. అటు.. హార్డ్ డ్రైవ్ తమకు అందలేదంటూ కాంతి.. డీటీడీసీ సిబ్బందిని సంప్రదించగా.. కొరియర్ 25నే డెలివరీ చేసినట్లు చెప్పారు. దీనిపై ప్రశ్నించగా.. తాను హార్డ్ డ్రైవ్ చరితకు ఇచ్చానని ఆఫీస్ బాయ్ రఘు తెలిపాడు. అయితే, అప్పటి నుంచి చరిత అందుబాటులో లేకుండా పోయినట్లు తెలుస్తోంది.
డేటా లీక్ అయితే..
చరిత, రఘు ఇద్దరూ కలసి సినిమాకు సంబంధించి కీలక హార్డ్ డ్రైవ్‌ను మాయం చేశారంటూ విజయ్ పోలీసులను ఆశ్రయించారు. ఇందులోని కీలక డేటా లీక్ అయినా.. డిలీట్ అయినా తమ సంస్థకు భారీ నష్టం వచ్చే అవకాశం ఉందన్నారు. వీలైనంత త్వరగా హార్డ్ డ్రైవ్‌ను రికవరీ చేసి తమకు అప్పగించాలని కోరారు. పోలీసులు దీనిపై విచారిస్తున్నారు.
'కన్నప్ప' మూవీపై మంచు విష్ణు చాలా ఆశలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా ఆలస్యమైందని తాజాగా చెప్పారు విష్ణు. మూవీ రన్ టైం 3 గంటల 10 నిమిషాలు ఉంటుందని అన్నారు. ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఇంత భారీ సినిమా చేయలేదని తెలిపారు. ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.