No unity in Tollywood: టాలీవుడ్ కు చెందిన సినిమాలు గ్లోబల్ గా సంచలన విజయాలు సాధిస్తున్నాయి కానీ ఇక్కడ పరిశ్రమ మాత్రం కొంత మందిచేతుల్లో నలిగిపోతోంది. ఆ నలుగురు పేరుతో కొంత మంది ఇండస్ట్రీని శాసిస్తున్నారు. పోనీ వారి మధ్య అయినా ఐక్యత ఉందా అంటే అదీ లేదు. ఈ కారణంగా టాలీవుడ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ప్రభుత్వాల ఆగ్రహానికి గురవుతోంది. 


సినీ పరిశ్రమను గుప్పిట పట్టిన ఆ నలుగురు                                     


టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు ఉంటారు.కానీ పేరుకే చాలా మంది నిర్మాతలు. వారిలో కొంత మంది సినిమాలు తీస్తారు. చాలా మంది తీయరు. ఇతర సీనియర్ నిర్మాతలు సినిమాలు తీయడం కన్నా.. ఇండస్ట్రీలో ఇతర వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ధియేటర్లు లీజుకు తీసుకోవడం.  క్యూబ్ , యూఎఫ్‌వో లాంటి వాటికి లైసెన్సులు తీసుకోవడం, ఓటీటీలు రన్ చేయడం సహా చాలా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. వారే ఇండస్ట్రీని  శాసిస్తున్నారు.  కానీ వారిలో వారే ఆధిపత్య పోరాటం కోసం ప్రయత్నిస్తూ ఉండటంతో మొత్తం వివాదం ప్రారంభమవుతోంది. 


ఆ నలుగురి మధ్య కూడా లేని ఐక్యత                 


ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు తీసేవాళ్లు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లు, ఎగ్జిబిటర్లు సహా వివిధ రకాల ఆదాయవనరులు ఉన్న చోట్ల కేవలం నలుగురు, ఐదుగురి ముద్రే కనిపిస్తోంది. ఆ కొద్ది మంది కూడా తమలో తాము ఆధిపత్య పోరాటం చేసుకుంటున్నారు. కుట్రలు చేసుకుంటున్నారు. ఒకరి సినిమాలు మరొకరు పైరసీ చేసుకుంటున్నారు. తన గేమ్ ఛేంజర్ మొదటి రోజునే హెచ్ డీ ప్రింట్ బయటకు వచ్చిందని దానికి.. మరో నిర్మాత కారణం కావొచ్చని దిల్ రాజు పరోక్షంగా తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. అంటే వారి మధ్య కూడా స్పష్టత.. సఖ్యత లేదని అర్థమవుతుంది. 


ఇండస్ట్రీని ఏం చేయాలనుకుంటున్నారు ?                 


ఈ నలుగురిలో కొంత మంది రాజకీయ అవసరాల కోసం ఇతర పార్టీలతో కలుస్తున్నారు. వారి వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీగా సినిమాలు రిలీజవుతున్న సమయంలో ధియేటర్ల బంద్ అనే నినాదం తీసుకు రావడం వెనుక  ఆ నలుగురిలో ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించారని..ఆయన ఏపీలో ఓ పార్టీకి సన్నిహితంగా ఉంటారని చెబుతున్నారు. ఈ వ్యవహారాలు మొత్తం వివాదాస్పదమవుతున్నాయి. టాలీవుడ్ లో ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటున్నారు. ఒకరి సినిమా ఫ్లాప్ కావడానికి మరొకరు ప్రయత్నిస్తున్నారు. 


రాజకీయ ఎజెండాలను కూడా అమలు చేస్తూండటంతో మొత్తంగా రెండు తెలుగు ప్రభుత్వాలకూ టాలీవుడ్ దూరం అయింది. ఇప్పుడు ఆధిపత్య పోరాటం కూడా బహిరంగంగానే కనిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ ఇక ఏకతాటిపైకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది.