అల్లు ఇంట కొణిదెల కుటుంబం కనిపించింది. కానీ, నందమూరి ఇంట జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరున్న కుటుంబాల్లో ఇటీవల రెండు మరణాలు చోటు చేసుకున్నాయి. ఓ మరణం కొన్ని పుకార్లకు చెక్ పెడితే... మరొకరిది మళ్ళీ పాత చర్చను తెరపైకి తీసుకొచ్చింది. అల్లు - కొణిదెల కుటుంబాలు కలిస్తే... సొంత (నందమూరి - నారా - దగ్గుబాటి) కుటుంబాలకు తారక్ దూరంగా ఉన్నారు. అల్లు - కొణిదెల కుటుంబాలు కలిశాయ్!మెగా (కొణిదెల) కుటుంబానికి అల్లు అర్జున్ దూరం అవుతున్నారని, మెగా నీడ నుంచి బయటకు వచ్చి సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారని కొన్నాళ్లుగా బలమైన ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో గొడవలు ముదిరాయని, ఇకపై మెగా ఫ్యామిలీతో కలవడం కష్టమని చర్చ జరిగింది. కానీ సమయం సందర్భం వచ్చిన ప్రతిసారీ తాము ఒక్కటేనని కొణిదెల - అల్లు కుటుంబాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి.
పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఒక్క రోజు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో అరవింద్ కుటుంబానికి చిరు బాసటగా నిలిచారు. జైలు నుంచి వచ్చార చిరంజీవికి ఇంటికి సతీసమేతంగా అల్లు అర్జున్ వెళ్లి వచ్చారు. అల్లు రామలింగయ్య సతీమణి, అరవింద్ తల్లి - అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం ఇటీవల కన్ను మూశారు. ఆ సమయంలో అర్జున్ ముంబై, అరవింద్ బెంగళూరులో ఉన్నారు. అత్తయ్య మరణవార్త తెలిసిన వెంటనే అల్లు ఇంటికి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. అమ్మమ్మ ఇకలేరని తెలిసి మైసూరులో పెద్ది షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని రామ్ చరణ్ వచ్చారు. ఇద్దరూ పాడె మోశారు.
సేనతో సేనాని కార్యక్రమం వల్ల కనకరత్నం మరణించిన రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావడం వీలు పడలేదు. మర్నాడు అల్లు కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటికి వచ్చిన మావయ్యను అల్లు అర్జున్ రిసీవ్ చేసుకుని లోపలకు తీసుకు వెళ్లారు. దీంతో పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొణిదెల - అల్లు కుటుంబాలు తమ మధ్య దూరం తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఇలా కలుస్తూ ఉండటం వల్ల రెండు కుటుంబాలు ఒక్కటేనని సిగ్నల్స్ వెళ్లాయి. ఈ విధంగా నందమూరి కుటుంబంలో జరగలేదు.
సొంత కుటుంబానికి దూరంగా ఎన్టీఆర్!?ఇటీవల నందమూరి కుటుంబంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ఆగస్టు 19న సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కోడలు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి, నందమూరి జయకృష్ణ భార్య పద్మజ మరణించారు. ఆవిడ అంతిమ సంస్కారాల్లో నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. అయితే మరణించిన పదమూడో రోజున జరిగిన దశదిన కర్మకు కళ్యాణ్ రామ్ హాజరయ్యారు. కానీ జూనియర్ ఎన్టీ రామారావు కనిపించలేదు.
'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాతయ్య పేరు చెప్పి బాబాయ్ బాలకృష్ణ పేరును ఎన్టీఆర్ చెప్పలేదని ఆయన్ను కొందరు ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. హీరోగా ఎదిగే సమయంలో బాలయ్య పేరు చెప్పి, ఇప్పుడు చెప్పకపోవడం ఏమిటని ప్రశ్నించాయి. విజయవాడలో 'వార్ 2' విడుదలకు ముందు సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ ఫ్లెక్సీలతో హడావిడి చేయడం సైతం వివాదానికి దారి తీసింది. అంతకు ముందు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు గైర్హాజరు కావడాన్ని నందమూరి - టీడీపీ శ్రేణులు గుర్తు చేశాయి. ఒకవైపు ఈ మంట రగులుతుండగా మరొకవైపు ఎన్టీఆర్ మీద బూతులతో విరుచుకుపడుతూ టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినట్టు, ఆయన పేరుతో ఒక ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది. అది తనది కాదని, ఏఐ ద్వారా వాయిస్ క్రియేట్ చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఆ వివాదంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనకు వార్నింగ్స్ ఇచ్చారు.
ఆ ఇష్యూలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టు తెలిసింది. ఒక విధంగా సొంత కుటుంబంతో ఎన్టీఆర్‌కు దూరం పెరుగుతోందని వస్తున్న వార్తలకు చంద్రబాబు కుటుంబం నుంచి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ జయంతికి చంద్రబాబు సహా నారా లోకేష్, బ్రాహ్మణి తదితరులు ట్వీట్లు చేశారు. సోషల్ మీడియాలో హరికృష్ణతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ తరుణంలో పద్మజ అంతిమ, దశదిన కార్యక్రమాలకు ఎన్టీఆర్ హాజరైతే తామంతా ఒక్కటేనని చెప్పినట్టు అయ్యేది. ఆయన గైర్హాజరు కావడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read: అవును... ఎన్టీఆర్ - నీల్ సినిమాలో హీరోయిన్ ఈ అమ్మాయే - కన్ఫర్మ్ చేసిన 'మదరాసి' నిర్మాత
ఎన్టీఆర్ గైర్హాజరు గురించి ప్రస్తావన వస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆయన హాజరు అయితే సముచిత గౌరవం, మర్యాద దక్కేదా? అని ప్రశ్న సైతం ఉత్పన్నం అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెడితే దాన్ని తీయమని బాలకృష్ణ ఆదేశించారు. తారకరత్న మరణించిన తర్వాత జరిగిన కార్యక్రమాలకు హాజరైతే కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ సోదరులతో బాలకృష్ణ మాట్లాడలేదు. ఇప్పటికీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఆ రెండు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ హాజరు అయ్యి ఉండకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఓ సినిమా పనుల మీద ముంబైలో ఉండటం వల్ల ఆయన రాలేకపోయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఏది ఏమైనా ఆయన రాకపోవడం మళ్ళీ పాత చర్చకు దారి తీస్తోంది. ఆయన వైపు నుంచి కలిసే ప్రయత్నాలు జరగడం లేదని తాజా పరిణామాలను బట్టి టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
ప్రతి కుటుంబంలో మనస్పర్థలు, కొన్ని గొడవలు సహజం. కాలంతో పాటు కొన్ని మరుగున పడతాయి. తమ మధ్య గొడవలు పక్కన పెట్టి కుటుంబ సభ్యులు కలుస్తారు. నందమూరి, నారా కుటుంబాలతో ఎన్టీఆర్ సైతం అలా కలవొచ్చు. ఈ చర్చకు అప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది.
Also Read: మదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్న శ్రియ... అప్పుడు 'దృశ్యం', 'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు 'మిరాయ్'