NTR Shared Video Of A Japanese Fan: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం జపాన్‌లో సందడి చేస్తున్నారు. ఆయన నటించిన 'దేవర' (Devara) మూవీ ఈ నెల 28న జపనీస్‌లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అక్కడి అభిమానులకు ఆటోగ్రాఫ్స్ ఇస్తూ.. థియేటర్లలో అభిమానులతో సందడి చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 

'ఆ విషయం నన్ను కదిలించింది'

తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా జపనీస్ ఫ్యాన్ తెలుగులో మాట్లాడుతోన్న వీడియోను పోస్ట్ చేశారు. తాను 'RRR' మూవీ చూసిన తర్వాతే తెలుగు నేర్చుకున్నానని చెప్పడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆ అభిమాని మాటలకు ఫిదా అయ్యారు. 'నేనెప్పుడు జపాన్ సందర్శించినా నాకు మంచి మెమొరీస్ అందిస్తుంది. RRR సినిమా చూసిన తర్వాతే తాను తెలుగు నేర్చుకున్నానని ఓ అభిమాని చెప్పడం నన్ను నిజంగా కదిలించింది.

Also Read: విక్రమ్ మూవీ 'వీర ధీర శూర'కు షాక్ - సినిమా విడుదలపై నాలుగు వారాలు స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు

భాషలు, సినీ అభిమానిగా.. విభిన్న సంస్కృతులతో పాటు భాష నేర్చుకునేందుకు సినిమా దోహదపడుతున్నందుకు సంతోషిస్తున్నా. ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్‌గా అభిమానుల్ని సొంతం చేసుకుంటుందనేందుకు ఇది మరో కారణం.' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఎన్టీఆర్ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ మాటలకు ఫిదా..

అన్నా నేను 'RRR' చూసిన తర్వాతే తెలుగు నేర్చుకున్నానని ఓ జపనీస్ ఫ్యాన్ ఎన్టీఆర్‌కు చెబుతూ.. ఆయన వావ్ అంటూ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా తాను రెండేళ్లుగా తెలుగు నేర్చుకుంటున్నానని ఓ బుక్ చూపించింది. ఆ తర్వాత ఆమెకు ఆటోగ్రాఫ్ ఇస్తూ.. నువ్వు ఇన్‌స్పిరేషన్ అంటూ ఆమెకు చెప్పారు. 

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలోని బిగ్గెస్ట్ హిట్ 'దేవర' మూవీ జపనీస్ లాంగ్వేజ్‌లో ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లలో ఎన్టీఆర్, కొరటాల శివ విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇటీవలే ఓ థియేటర్‌లో అభిమానితో కలిసి 'ఆయుధ పూజ' సాంగ్‌కు డ్యాన్స్ సైతం చేశారు. జపనీస్ అభిమానులు ఎన్టీఆర్ కటౌట్ పెట్టి పూజలు సైతం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించారు. మరోవైపు, ఈ మూవీకి సీక్వెల్‌గా 'దేవర 2' తెరకెక్కనుండగా.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.