ఎన్టీఆర్ అంటే తెలుగు, తెలుగంటే ఎన్టీఆర్ అనే విధంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన కళాకారుడు ఎన్టీఆర్. నటన మాత్రమే కాదు సినిమాల నిర్మాణం, దర్శకత్వం, ఇలా ఏది చేపట్టినా అది పర్ఫెక్ట్. ఎన్టీఆర్ దర్శకత్వం వహించి, నిర్మించి, నటించిన సినిమాల్లో ముందుగా గుర్తొచ్చే సినిమా ‘దాన వీర శూర కర్ణ’.


మహా భారత కథలో కర్ణుడి పాత్రకు ప్రాధాన్యతను ఇస్తూ ఎన్టీఆర్ స్క్రిప్ట్ రూపొందించారు. ఎన్టీఆర్ స్వయంగా కర్ణుడిగా, దుర్యోధనుడిగా, శ్రీ కృష్ణుడిగా మూడు పాత్రల్లో అలరించారు. ఈ సినిమాల్లో కేవలం ఏన్టీఆర్ ఒక్కరే ఒకటికి మించిన పాత్రలు వేశారనుకుంటే పొరపాటే. చలపతిరావుతో నాలుగు పాత్రల్లో నటింపజేశారు ఎన్టీఆర్. చలపతి రావు ఇంద్రుడిగా, జరాసంథుడిగా, అతిరథుడిగా, దుష్టద్యుమ్నుడిగా నాలుగు పాత్రల్లో నటించారు.


ఎన్టీఆర్ అభిమాని, గుంటూరు వాస్తవ్యులు బుడేఖాన్‌తో రెండు పాత్రలు వేయించారు. ఒకటి ఘటోత్కచుడైతే మరోటి ఒక చిన్న పాత్ర,. ఆ రోజుల్లో వర్తమాన నడుడైన జయ భాస్కర్ చేత కూడా రెండు పాత్రల్లో నటింపజేశారు. జయభాస్కర్ ఏకలవ్యుడిగానూ, సూర్యుడిగానూ చేశారు. రామారావు దర్శకుడిగా, నిర్మాతగా ఇంత మంది నటులతో ఒకటికి మించి పాత్రల్లో నటింపజేసిన అద్భుత కళాఖండం ‘దాన వీర శూర కర్ణ’. ఈ సినిమాను దర్శకత్వ ప్రతిభకు పట్టం కట్టిన సినిమాగా చెప్పవచ్చు.


ఇంత మంది నటులు రెండేసి, మూడేసి పాత్రల్లో నటించినప్పటికీ ఎక్కడా నటులు కనిపించరు. కేవలం పాత్రలు మాత్రమే మనం గుర్తించగలుగుతాం. ఏ నటుడూ మనకు తారసపడినట్టు అనిపించరు. ఎన్టీఆర్ నటనా కౌశలాన్ని గురించి మనం మాట్లాడితే సూర్యుడికి దివిటి చూపినట్టే. పౌరాణిక పాత్రాపోషణలో ఆయనను మించి ఎవరుంటారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది దర్శకత్వ పటిమ, నిర్మాణ కౌశలాన్ని గురించి మాత్రమే.


ఒక సినిమాను దర్శకత్వం వహిస్తూ నిర్మించడమే చాలా శ్రమకోర్చి చెయ్యాల్సి వస్తుంది. అటువంటిది ఆయన దర్శకత్వం వహిస్తూ, నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తూ మరో వైపు మూడు ముఖ్య పాత్రలను పోషించడమంటే అది మాటల్లో చెప్పతరమా? అంతే కాదు ఆ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలోనే గొప్ప సినిమాగా నిలబెట్టడమనేది న భూతో న భవిష్యతి. స్క్రిప్ట్ వర్క్ కి ఎన్టీఆర్ ఎంత ప్రాధాన్యతను ఇస్తారనే విషయాన్ని ఈ సినిమా సాగిన తీరు చెప్పకనే చెబుతుంది.


ఎడిటింగ్ తర్వాత దాదాపుగా మూడున్నర గంటల నిడివి కలిగిన సినిమా ఇది. దీన్ని షూట్ చేసేందుకు కేవలం 43 రోజుల సమయం తీసుకున్నారు ఎన్ట్ఆర్. కేవలం 24 లక్షల ఖర్చుతో పూర్తిచేశారు. 1977లో విడుదలైన ఈ సినిమా కోటి రూపాయల పైచిలుకు వ్యాపారం చేసింది ఆరోజుల్లో. రీ రిలీజ్ చేసినపుడు కూడా మరో కోటి వసూలు చేసిందట.  కర్ణుడు ఈ కథకు నాయకుడు. కాని రెండు మూడు సీన్లతో దుర్యోధనుడు హీరో కావచ్చని అనిపిస్తుంది. కర్ణ పాత్రను బాగా అభిమానించే ఎన్టీఆర్.. అతడి ఇతివృత్తాన్ని సినిమాగా తియ్యాలని అనుకున్నారు. శ్రీ కృష్ణుడి చేత కర్ణుడి గొప్పతనాన్ని ప్రేక్షకులు గుర్తించే విధంగా చెప్పించారు కూడా. దుర్యోధనుడిని కూడా రొమాంటిక్ గా చూపించగల సత్తా ఎన్టీఆర్ సొంతం. ఎన్టీఆర్ నటించిన మూడు పాత్రలు, కృష్ణ, ధుర్యోధన, కర్ణ పాత్రలు నాలుగు  సన్నివేశాల్లో ఒకేసారి కనిపిస్తాయి. ఒకే షాట్ లోనూ మూడు పాత్రలను కూడా చూపించారు.  ఇంత టెక్నాలజీ అందుబాటులో లేని ఆరోజుల్లోనే అటువంటి చిత్రీకరణ సుసాధ్యం చేశారు ఎన్టీఆర్.


సినిమా రచయిత కాని కొండవీటి వెంటక కవి ఈ సినిమాకు మాటలు అందించారు. ఈ సినిమా డైలాగులు ఇప్పటికీ జనం నోర్లలో నానుతూనే ఉంటాయి. ‘‘ఎమంటివేమంటివి’’ అని ఒక్కసారైనా అనని తెలుగు వాడు ఒక్కడు కూడా ఉండడు అంటే అది అతిశయోక్తి కాదు. అంత పాపులర్ ఈ సినిమాలోని మాటలు. అద్భుత పోరాట సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు మామూలుగా ఉండవు. అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోగా చరిత్రలో నిలిచిపోయింది.