నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటించిన ప్రప్రథమ చిత్రం ‘మన దేశం’ చిత్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. నందమూరి తారక రామారావు మొట్టమొదటి చిత్రంగా చెప్పుకునే ఈ సినిమా 24 నవంబర్, 1949న విడుదలైంది. 24 నవంబర్, 2024తో ఈ మూవీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు చలన చిత్ర నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొందరు లెజెండ్స్ మరణించినప్పటికీ ఏదో ఒక రూపంలో ఎప్పుడూ ప్రస్తావించబడుతూనే ఉంటారు. అలాంటి లెజెండ్స్‌లో నందమూరి తారక రామారావు ఒకరు. ఆయన ధరించిన పాత్రలతో... మనిషిగా ఆయన లేనప్పటికీ నిత్యం ఏదో ఒక సందర్భంలో ఆయన పాత్రలు మనిషి జీవితంతో మమేకమై నడిపిస్తూనే ఉన్నాయి. తొలి చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నందమూరి తారక రాముడు... ఆ తర్వాత రాముడిగా, కృష్ణునిగా ఇలా ఎన్నో భగవంతుని పాత్రలలో నటించి... తెలుగు వారికి ఆరాధ్యదైవమయ్యారు. అలాంటి తారక రాముని మొట్ట మొదటి చిత్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 14న విజయవాడలో ఓ గ్రాండ్ వేడుకను నిర్వహించేందుకు టాలీవుడ్ ప్రముఖులు సన్నాహాలు చేస్తున్నారు.
అందు నిమిత్తం.. ఈ వేడుక ఏర్పాట్లను చర్చించేందుకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హైదరాబాద్ కార్యాలయంలో డిసెంబర్ 4వ తేది, సాయంత్రం 4 గంటలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘాలకు చెందిన ప్రతినిధులు అందరూ హాజరై ‘మన దేశం’ 75 సంవత్సరాల వేడుకను విజయవాడలో నిర్వహించడంపై చర్చించారు. ఈ వేడుకకు సినీ ప్రదర్శకులు, సినీ పంపిణీదారులు, సినీ నిర్మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని వీరంతా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు మొదలైనట్లుగా వారు తెలిపారు.
‘మన దేశం’ విషయానికి వస్తే... నందమూరి తారక రాముని పుట్టిన రోజును తెలుగు జాతి ఎలా అయితే గుర్తు పెట్టుకుంటుందో 1949, నవంబర్ 24కు కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు తెరపై రామారావు అనే తార ఉదయించిన రోజు అది. నందమూరి తారక రామారావు నటించిన మొట్టమొదటి చిత్రం విడుదలైన రోజది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. దేశభక్తుడు నారాయణ రావును అరెస్ట్ చేసే పాత్రలో ఆయన నటించారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి కొన్ని రోజుల ముందు ఈ సినిమా తీయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఈ సినిమాను విడుదల చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు. ఆ తర్వాత రెండేళ్లకు ఈ సినిమా విడుదలైంది. బెంగాలీ నవల, ప్రముఖ రచయిత శరత్ బాబు రాసిన ‘విప్రదాస్’ స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించారు.
Also Read: అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?