దర్శకుడి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సినిమాలు చేసిన కథానాయకుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao). కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎలా చెబితే అలా అన్నమాట! దర్శకుని మాట వేదమని మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన హీరో. 


NTR Movies Directors : ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రమే కాదు... ఆయనలోనూ ఓ దర్శకుడు ఉన్నారు. కథ, స్క్రీన్ ప్లే రచయిత ఉన్నారు. తెలుగు చిత్రసీమలో నటుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన... ఆ తర్వాత బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. సినీ జీవితంలో 93 మంది దర్శకులతో పని చేశారు. ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు.


ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన రికార్డు ఎన్టీఆర్ దే!
ఎన్టీఆర్ (NTR)తో ఎంతో మంది దర్శకులు పని చేశారు కదా! మరి, ఆయనతో ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడు ఎవరో తెలుసా? ఎన్టీఆరే. అవును... స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన సినిమాల సంఖ్య 17! ఎన్టీ రామారావును ఎక్కువ సినిమాల్లో డైరెక్ట్ చేసిన రికార్డ్ ఆయన పేరు మీదే ఉంది. 


తర్వాత స్థానంలో ఆ ఇద్దరూ!
ఎన్టీఆర్ హీరోగా ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుల జాబితాలో రెండో స్థానంలో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరూ... ఆయనకు అత్యంత ఆత్మీయులుగా, ఆస్థాన దర్శకులుగా ముద్రపడిన సి.ఎస్. రావు, డి. యోగానంద్! ఎన్టీఆర్ హీరోగా చెరో 16 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 


పౌరాణిక బ్రహ్మతో 15...
జానపద బ్రహ్మతో 13!
ఎన్టీఆర్ హీరోగా నటించిన తెలుగు, తమిళ ద్విభాషా సినిమా 'చంద్రహారం'. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఆ సినిమాకు కమలాకర కామేశ్వర రావు దర్శకుడు. ఆయనకు తొలి చిత్రమది. ఆ తర్వాత పౌరాణిక బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా 15 చిత్రాలకు కామేశ్వర రావు దర్శకత్వం వహించారు. వాటిలో సింహ భాగం పౌరాణిక చిత్రాలదే. ఇక, జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ 13 చిత్రాలు చేశారు. 


మార్గదర్శి కేవీ రెడ్డితో 10 చిత్రాలు
దర్శకులు కేవీ రెడ్డిని ఎన్టీఆర్ తన మార్గదర్శిగా భావించేవారు. వాళ్ళిద్దరి కలయికలో పది చిత్రాలు వచ్చాయి. కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన చివరి సినిమా 'శ్రీకృష్ణ సత్య'లో ఎన్టీఆర్ హీరోగా నటించారు. అంతే కాదు... సొంత నిర్మాణ సంస్థ ఎన్.ఎ.టిలో నందమూరి సోదరులు నిర్మించిన తొలి రంగుల సినిమా అది. 


ఆ ఇద్దరితో తొమ్మిదేసి చిత్రాలు
ఎన్టీ రామారావును చిత్రసీమకు పరిచయం చేసిన వ్యక్తి ఎల్వీ ప్రసాద్. వాళ్ళిద్దరి కలయికలో తొమ్మిది సినిమాలు వచ్చాయి. అలాగే, తనను హీరోని చేసిన బి.వి. సుబ్బారావు దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ తొమ్మిది సినిమాలు చేశారు.


దర్శకేంద్రుడితో 12...
దర్శకరత్నతో ఐదు!
పౌరాణిక, జానపద చిత్రాలతో తిరుగులేని అభిమానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్, నవతరం దర్శకులతో కమర్షియల్ సినిమాలు కూడా చేశారు. సూపర్ డూపర్ హిట్ అడవి రాముడు' సహా ఎన్టీఆర్ హీరోగా దర్శకేంద్రుడు కోవెలమూడి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాల సంఖ్య 12. దర్శకరత్న దాసరి నారాయణరావు ఐదు సినిమాలు చేశారు.


Also Read : ఎన్టీఆర్ గాంధీగా మారిన వేళ - నెహ్రూ ఆశ్చర్యపోయిన సభ, స్వర్ణ పతకంతో సత్కారం!


ఎన్టీఆర్ హీరోగా ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత అందుకున్న వారిలో వేదాంతం రాఘవయ్య, వి. మధుసూదన రావు, ఎస్.డి. లాల్... ఆరేసి చిత్రాలు తీసిన దర్శకుల్లో కె. హేమాంబరధరరావు, తాతినేని ప్రకాశ్ రావు... ఐదు సినిమాలు తీసిన దర్శకుల్లో పి. పుల్లయ్య, కె. బాపయ్య ఉన్నారు. 


ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన తొలి సినిమా 'రాముడు - భీముడు'. ఆ సినిమాకు తాపీ చాణిక్య దర్శకుడు. ఆయనతో నాలుగు సినిమాలు చేశారు ఎన్టీఆర్. 'మల్లీశ్వరి' దర్శకుడు బీఎన్ రెడ్డితోనూ నాలుగు సినిమాలు చేశారు.     


Also Read : నట సార్వభౌముడు దర్శకత్వం వహించిన సినిమాలివే - ఒక్కోటీ, ఒక్కో ఆణిముత్యం!