నందమూరి తారక రామారావు. తెలుగు వారు గర్వించే మహా నటుడు. ప్రజారంజక పాలన అందించిన రాజకీయనాయకుడు. భారతీయ సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నట సార్వభౌముడు.  తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి సుమారు 400 చిత్రాలలో నటించి మెప్పించిన ఘనుడు. ఎన్నో చిత్రాలకు నిర్మాతగా, మరెన్నో చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించి అద్భుత సినిమాలను తెరకెక్కించిన సినీ దార్శనికుడు.  పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాలు అనే తేడా లేకుండా అన్నింటా అద్భుతంగా రాణించిన నటుడు.  రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక పాత్రల్లో మేటి నటన కనబరిచి తెలుగు వారి హృదయాల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు ఎన్టీఆర్. 


తెలుగు రాజకీయల్లో ఎన్టీఆర్ కీలక ముద్ర


సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, అచిర కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రామారవు.  1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆయన, కేవలం 9 మాసాల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన రాజకీయ ధీరుడు ఆయన. మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అత్యధిక కాలం ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన చరిత్రను లిఖించారు. తన పాలనా కాలంలో ఎన్నో అత్యున్నత విధానాలకు రూపకల్పన చేశారు. ప్రజలు మెచ్చే పాలన అందించారు. చివరకు రాజకీయ చదరంగంలో ఓడిపోయి, గుండెపోటుతో కన్నుమూశారు.


తెలుగు హెరిటేజ్ డే గా ఎన్టీఆర్ జయంతి  


మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుక జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వేడులకు వైభవంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగర మేయర్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. తెలుగు ప్రజలందరూ అన్నగారిగా భావించి గౌరవించే  నందమూరి తారకరామారావు పుట్టిన మే 28వ తేదీని ప్రిస్కో నగర తెలుగు హెరిటేజ్ డే గా నిర్వహించనున్నట్లు ఆ నగర మేయర్ జెఫ్ చేనీ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజలందరూ ముందుకు వెళుతున్నారని, ఆయన శతజయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో తమ తరఫున ఆయనకు గౌరవార్థంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఒక నగర మేయర్   తెలుగు జాతి గుండెల్లో పెట్టుకున్న మహానుభావుడికి గౌరవార్థంగా తెలుగు హెరిటేజ్ డే గా ఆయన జయంతిని ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రజలు కొనియాడుతున్నారు.


అమెరికాలో నివసిస్తున్న నాలుగున్నర లక్షల తెలుగు ప్రజలు


నిజానికి అమెరికాలో చాలా మంది తెలుగువారు ఉన్నారు. ఉద్యోగాల కోసం, చదువుల కోసం వెళ్లినవారితో పాటు అక్కడే నివాసం ఉంటున్న వారి సంఖ్య భారీగా నే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో నాలుగున్నర లక్షల మంది తెలుగు వారు నివసిస్తున్నారు. అమెరికా అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర అత్యంత కీలకంగా ఉంది. పలు రంగాల్లో తెలుగు వారు ప్రతిభ కనబర్చుతున్నారు. అలాంటి తెలుగువారు అమితంగా ఇష్టపడే ఎన్టీఆర్ కోసం  ప్రిస్కో నగర మేయర్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.  తెలుగు నటుడికి అరుదైన గుర్తింపు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు చెప్తున్నారు.


Read Also: అట్టహాసంగా పరిణీతి చోప్రా - రాఘవ చద్దా నిశ్చితార్థ వేడుక, నెట్టింట్లో ఫోటోలు వైరల్‌