భగవంత్‌ కేసరి సినిమా ట్రైలర్‌ విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యల చేశారు. తాను హీరోగా నటించిన అఖండ సినిమా విడుదల సమయంలో, ప్రభుత్వాలు సహకరించలేదన్నారు. వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడారు.


ప్రభుత్వాలు సహకరించలేదు


సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే మీమాంసలో చిత్ర పరిశ్రమ  ఉండేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో అఖండ మూవీని విడుదల చేశామన్నారు. ప్రభుత్వాలు తమకు  సహకరించలేదని,  అదనపు షోలకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. టికెట్‌ రేట్లు పెంచే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వెల్లువలా తరలిరావడంతో, అఖండ సినిమా అనేక రికార్డులు  సృష్టించిందన్నారు. పారిశ్రామిక రంగాన్ని ఎలా గుర్తిస్తారో చిత్ర పరిశ్రమకు అలాంటి గుర్తింపే ఇవ్వాలన్నారు. 


కాజలతో నటించాలని అనుకునేవాణ్ని


బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.  కాజల్‌, శ్రీలీల దీనిలో కీలకపాత్రలు పోషించారు. కాజల్‌ మంచి నటి అన్న బాలయ్య, ఆమెతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాడిని అన్నారు. శ్రీలీల ఇందులో తనకు కుమార్తెగా నటించిందన్నారు. తర్వాత సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిద్దామని శ్రీలీలతో చెప్పానన్నారు. ఇదే మాటను తన కుటుంబసభ్యులతో పంచుకున్నట్లు తెలిపారు.  తన కుమారుడు మాత్రం ఏంటి డాడీ, నేను హీరోగా రాబోతుంటే నువ్వేమో ఆమెకు ఆఫర్‌ ఇస్తావా ? అంటూ తనపై కోప్పడ్డాడని వెల్లడించారు. అనిల్‌ రావిపూడి సెట్స్‌లో జోక్స్‌ వేసి నవ్విస్తూ ఉండేవాడన్నారు. భగవంత్ కేసరి ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


అమ్మవారే రప్పించారని అనుకుంటున్నా


దసరా నవరాత్రులు సమీపిస్తున్న సమయంలో  భద్రకాళి అమ్మవారే తనను ఇక్కడికి రప్పించారని అనుకుంటున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మలాంటి ఎందరో పోరాట యోధులను స్మరించుకుంటున్నానన్న ఆయన, పెండ్యాల రాఘవయ్య వరంగల్‌ ఎంపీగా, హనుమకొండ ఎమ్మెల్మేగా, వర్దన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు.  1984లో నాన్న ఎన్టీఆర్ గుడివాడ, హిందూపూర్‌, నల్గొండ నుంచి పోటీ చేసి, మూడు చోట్లా విజయం సాధించారని గుర్తు చేశారు. 


తెలంగాణ మాండలికంలో సంభాషణలు


ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో సంభాషణలు చెప్పానన్నారు బాలయ్య. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనమున్న సినిమాలు అందించాలనేదే తన తాపత్రయమని వెల్లడించారు. అఖండ తర్వాత ఏం చేయాలనుకున్న తరుణంలో వీరసింహారెడ్డిలో నటించినట్లు తెలిపారు. తర్వాత ఏంటని అనుకుంటున్న సమయంలో అనిల్‌ రావిపూడి ఈ కథ చెప్పడంతో ఒకే చేశానన్నారు. ప్రతి సినిమాని సవాలుగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. 


మేకింగ్‌ పరంగానూ, బడ్జెట్‌ పరంగా నిర్మాతలు ఎంతో స్వేచ్ఛనిచ్చారని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. సినిమా  ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారన్న అనిల్, కాజల్‌తో తొలిసారి కలిసి పనిచేశానన్నారు. భగవంత్ కేసరిలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంటుందని, అర్జున్‌ రాంపాల్‌ తెలుగు నేర్చుకుని డబ్బింగ్‌ చెప్పారని తెలిపారు. భగవంత్‌ కేసరి, విజ్జిపాప మధ్య భావోద్వేగ ప్రయాణం చాలా బాగుంటుందన్న దర్శకుడు,  శ్రీలీల విజ్జిపాపగా చాలా బాగా నటించిందని కితాబిచ్చారు.  బాలయ్య బాబు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారని, కొత్త పాత్ర ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఓ స్టూడెంట్‌ నడుంచుకుంటారని వెల్లడించారు. తాను రాసిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ కష్టపడ్డారని అన్నారు.