టాలీవుడ్ హీరో నితిన్ కెరీర్లో దాదాపు 30 సినిమాలున్నాయ్. ఆరంభంలో జయం, దిల్, సై వంటి హిట్స్ పడ్డాయ్. ఆ తర్వాత దాదాపు పుష్కర కాలంపాటూ ఒక్క హిట్ కూడా పలకరించలేదు. ఎట్టకేలకు ఇష్క్, గుండెజారి గల్లంతైందే సినిమాలతో కెరీర్ గాడిన పడిందనుకున్నాడు. హార్ట్ అటాక్, అ ఆ సినిమాలతో ఆ జోరు కొనసాగించాడు. భీష్మ మూవీతో బ్లాక్ బస్టర్ అంటే ఇదీ అనిపించుకున్నాడు. అంతే మళ్లీ పరిస్థితి మొదటికెళ్లింది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత ఇప్పటివరకూ ఆ రేంజ్ హిట్ మళ్లీ పడలేదు. భీష్మ మూవీ తర్వాత రాబిన్ హుడ్, ఎక్ట్స్రార్డనరీ మ్యాన్ నుంచి తమ్ముడు వరకూ ఒకదాన్నిమించి మరొకటి డిజాస్టర్ గా నిలిచాయ్. అందుకే నితిన్ తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహిస్తున్నట్టున్నాడు.
ఫ్లాపుల పరంపర నుంచి బయటపడాలంటే అప్రమత్తం కావాల్సిందే..రిస్క్ తీసుకోకూడదని ఫిక్సైనట్టున్నాడు. అందుకే హిట్ పక్కా అనే కథకోసం, ఒడ్డున పడేసే దర్శకుడితో మాత్రమే ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని ఫిక్సైనట్టున్నాడు. అందుకే వరుసగా మూడు సినిమాల నుంచి తప్పుకున్నాడు. వీటిలో రెండు సినిమాలు అనౌన్స్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే..మరోమూవీ అనౌన్స్మెంట్ కూడా లేకుండా ఇలా వార్త వచ్చింది ఆ తర్వాత తప్పుకున్నాడనే న్యూస్ హల్ చల్ చేస్తోంది.
శ్రీనువైట్ల తో నితిన్ ఓ సినిమా చేస్తాడనే గాసిప్ వచ్చింది. ఇప్పటికే వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో.. అంతకుమించి డిజాస్టర్స్ లో కొట్టుకుపోతున్న వైట్లతో మూవీ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయ్. మైనస్ మైనస్ ప్లస్ అవుతుందేమో..కథపై నమ్మకంతో ధైర్యంగా దిగుతున్నారనే హడావుడి జరిగింది. రేపోమాపో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారనుకున్నారంతా..కానీ ఆసినిమా నుంచి నితిన్ తప్పుకున్నాడన్నది లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..శ్రీనువైట్ల కొత్త ప్రాజెక్ట్ తో రాబోతున్నాడన్నది నిజమే కానీ నితిన్ తో కానేకాదట. మరి వైట్ల వచ్చేది ఎవరితోనో చూడాలి
ఇక ఇప్పటికే బలగం దర్శకుడు వేణుతో ఎల్లమ్మ ప్రాజెక్ట్ కి సైన్ చేసి ఆ తర్వాత తప్పుకున్నాడు నితిన్. బలగం లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తోన్న ఎల్లమ్మ పై మంచి అంచనాలే ఉన్నాయ్. కానీ ఏమైందో ఏమో..ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశాడు నితిన్. ఇక నితిన్ తప్పుకున్న మూడో సినిమా ఏంటంటే.. రైటర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అటకెక్కింది. పవర్ పేట పేరుతో రాబోయే ఆ మూవీని రెండు భాగాలుగా తీస్తామని అనౌన్స్ చేశారు కూడా. కథలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగాయ్. ఏమైందో మరి నితిన్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో సందీప్ కిషన్ వచ్చి చేరాడు.
మరి నితిన్ నెక్ట్స్ మూవీ ఏంటి?
ఇష్క్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. లాంగ్ గ్యాప్ తర్వాత ఇష్క్ మూవీ సక్సెస్ ఇచ్చినట్టే.. వరుస ఫ్లాపుల నుంచి ఈ మూవీ గట్టెక్కిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు నితిన్. అంచనాలు నిజం అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు..