Nithiin Gets Injured: యంగ్ హీరో నితిన్.. తన తరువాతి సినిమాపై ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు. ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. ఇంతలోనే షూటింగ్ సమయంలో నితిన్‌కు గాయాలు అయ్యాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నితిన్.. వేణు శ్రీ రామ్ డైరెక్షన్‌లో ‘తమ్ముడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. యాక్షన్ సీన్ కోసం ఇటీవల మారేడుమిల్లి ప్రయాణమయ్యింది ‘తమ్ముడు’ టీమ్. అక్కడే నితిన్‌కు గాయం అవ్వడంతో షూటింగ్ క్యాన్సల్ అయిపోయింది.


దాదాపు మూడు వారాలు


‘తమ్ముడు’ షూటింగ్‌లో నితిన్‌కు జరిగిన గాయం గురించి మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నితిన్ కూడా దీనిపై స్పందించలేదు. అయితే నితిన్ గాయాల నుంచి పూర్తిగా కోలుకోడానికి దాదాపు మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం. నితిన్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం అని ఇప్పటికే చాలాసార్లు బయటపెట్టాడు. అయితే పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ మూవీ టైటిల్‌తో తాను సినిమా తీయాలని నిర్ణయించుకున్న తర్వాత ‘తమ్ముడు’ కోసం ఎక్స్‌ట్రాగా కష్టపడాలని నితిన్ నిర్ణయించుకున్నాడట. అందుకే యాక్షన్ సీన్స్ బాగా రావాలని తపనపడుతున్నాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


‘వకీల్ సాబ్’ తర్వాత..


నితిన్ నటిస్తున్న ‘తమ్ముడు’ మూవీ.. అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధం కథాంశంతో ఉంటుందని, అందుకే ఈ మూవీకి ‘తమ్ముడు’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావించారట. ఇక పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ చేసి మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న వేణు శ్రీరామ్.. ఇప్పుడు తన ఫ్యాన్ అయిన నితిన్‌తో హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం నితిన్, దిల్ రాజు కాంబినేషన్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే మూవీ వచ్చింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక డిసాస్టర్‌గా నిలిచింది. అందుకే ఈసారి వీరి కాంబినేషన్‌లో మళ్లీ ‘దిల్’లాంటి కమర్షియల్ హిట్ పడాలని నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడు.


త్వరగా కోలుకోవాలి..


హీరో నితిన్ చివరిగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2023 డిసెంబర్‌లో విడుదలయ్యింది. ఆ సమయంలో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ విడుదలకు గట్టి పోటీ ఉన్నా కూడా తమ కమర్షియల్ కామెడీ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో అంత పోటీ మధ్యే ఈ మూవీని విడుదల చేశారు మేకర్స్. కానీ ఫస్ట్ డే నుండే మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో డిసాస్టర్‌గా నిలిచింది. శ్రీలీల.. ఇందులో హీరోయిన్‌గా నటించింది. తన క్రేజ్, డ్యాన్స్ కూడా మూవీ రిజల్ట్‌ను మార్చకపోగా.. శ్రీలీల స్టోరీ సెలక్షన్‌పై విమర్శలు మొదలయ్యాయి. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ తర్వాత నితిన్ నటిస్తున్న చిత్రమే ‘తమ్ముడు’. అందుకే ఈ మూవీతో ఎలాగైనా కమ్ బ్యాక్ ఇవ్వాలని ఈ హీరో కోరుకుంటున్నాడు. ఇంతలోనే తనకు షూటింగ్‌లో గాయాలు అనే వార్తలు వైరల్ అవ్వడంతో నితిన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Also Read: నా భర్త వల్లే ఆ నమ్మకం కలిగింది - విఘ్నేష్ గురించి చెప్తూ నయన్ ఎమోషనల్