సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్నాడు  హీరో నిఖిల్ సిద్దార్థ్. మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో రాణించాడు. కెరీర్ మొదట్లో మంచి హిట్లు తెచ్చుకున్నా, తర్వాత కథల ఎంపిక విషయంలో కాస్త తడబడ్డారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజి హిట్లతో దూసుకుపోతున్నారు.  ఆయన రీసెంట్ మూవీ ‘స్పై’ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించకపోయినా, మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘స్వయంభూ’ పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నది.  ఈ రోజు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది.  ఈ విషయాన్ని నిఖిల్ అధికారికంగా ప్రకటించారు. ‘The Epic Journey Begins’ అంటూ  మూవీకి సంబంధించిన పోస్టర్ ను షేర్ చేశారు. 


ఆట్టుకుంటున్న‘స్వయంభూ’ లేటెస్ట్ పోస్టర్


ఈ పోస్టర్‌లో గుర్రంపై ఉన్న నిఖిల్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. డ్రాగన్‌పై బాణం గురిపెట్టి ఉన్న నిఖిల్‌ను యోధునిగా చూపించారు మేకర్స్. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్ ఆకట్టుకోగా, ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ‘స్వయంభూ’ సోసియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పని చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ సెట్టింగ్స్ డిజైన్ చేయగా, వాసుదేవ్ మునెప్ప  డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీతో పాటు సుధీర్‌ వర్మతో నిఖిల్‌ ఓ సినిమా చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ సమర్పణలో ‘ది ఇండియా హౌస్‌’ పేరుతో ఇది తెరకెక్కనుంది. అటు ‘కార్తికేయ3’ కూడా లైనప్ లో ఉంది.






వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్


గత కొద్ది కాలంగా నిఖిల్ నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ‘కార్తికేయ-2’ పాన్ ఇండియా రేంజి సక్సెస్ ను అందుకుంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది.  నార్త్ లో బాలీవుడ్ బడా హీరోలను కాదని టాలీవుడ్ హీరో జైకొట్టారు అక్కడి  ప్రేక్షకులు. విడుదలైన  అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబట్టింది.  అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ దూసుకెళ్లింది. ఈ సినిమాపై ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ ప్రశంసలు కురిపించింది. శ్రీకృష్ణుడి తత్త్వం గురించి ఈ సినిమాలో చూపించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇస్కాన్ కేంద్రం  బృందావనానికి ‘కార్తికేయ-2’ బృందాన్ని ఆహ్వానించింది. ఈ సినిమా తర్వాత చేసిన ‘18 పేజెస్’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.    


Read Also: ఆస్పత్రిలో ‘ఠాగూర్‌’ సినిమా సీన్ చూపించారు - శ్రీహరి మరణం వెనక అసలు కారణం చెప్పిన డిస్కో శాంతి


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial