Nayanthara Letter: నయనతార.. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తలలో ఉండే పేరు. మరి కావాలని అలా జరుగుతుందో, లేదంటే నార్మల్‌గానే జరుగుతుందో తెలియదు కానీ.. నయనతార పేరు మాత్రం సోషల్ మీడియాలో నిత్యం సంచరిస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా ధనుష్‌తో గొడవ, కోర్టు కేసులు అంటూ నయనతార పేరు ఎలా వినబడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ప్రేమలు, పెళ్లి, పిల్లలు, సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు.. ఇలా ఏదో ఒకటి నయనతార పేరును హైలెట్ చేస్తూనే ఉండేవి. ఇప్పుడామె మరోసారి వార్తలలోకి వచ్చేసింది. ఈసారి ఏంటి కారణం అనుకుంటున్నారా? ఆమెకు ఉన్న ట్యాగే. విజయశాంతి తర్వాత అందరూ లేడీ సూపర్ స్టార్ అని పిలిచిన తార ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నయనతార మాత్రమే. ఆమె స్ట్రగుల్స్, సక్సెస్‌లు అలా ఉన్నాయి మరి. ఇప్పుడా ట్యాగే వద్దంటుంది నయన్. ఆ ట్యాగ్‌తో కంఫర్ట్‌గా ఉండలేను, దయచేసి నన్ను అలా పిలవకండి అంటూ.. సోషల్ మీడియా వేదికగా ఓ లేఖతో విజ్ఞప్తి చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఈ లేఖలో ఏముందంటే...
నయనతార ఎల్లప్పుడూ నయనతార మాత్రమే!‘‘నా ప్రియమైన అభిమానులకు, గౌరవనీయులైన మీడియా సభ్యులకు మరియు సినీ కుటుంబానికి నమస్కారం. నటిగా నా ప్రయాణంలో నా ఆనందానికి మరియు విజయానికి కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా జీవితం ఒక బహిరంగ పుస్తకం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మీ నిస్వార్థ ప్రేమ, ఆప్యాయతలతో నా జీవితం సంతోషం ఉంది. నాకు విజయం వచ్చినప్పుడు భుజం తడుతూ, కష్టం వచ్చినప్పుడు మద్దతు తెలుపుతూ.. ఇలా ఎప్పుడూ నా కోసం మీరు ఉన్నారు.
Also Read: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త... సూసైడ్ అటెంప్ట్ కేసులో విచారణ ముమ్మరం
మీలో చాలామంది నన్ను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలుస్తున్నారు. నాపై ఉన్న ప్రేమ, అభిమానాలతో అలా పిలుస్తున్నందుకు కృతజ్ఞురాలిని. అభిమానులు ఎంతో ప్రేమతో అలా పిలవడం ఆనందంగా ఉన్నా, నన్ను ‘నయనతార’ అని మాత్రమే పిలవాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే, ఆ పేరు నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. నేను ఎవరో నాకు తెలియజేస్తుంది. కేవలం ఒక నటిగా ఇది చెప్పడం లేదు.. ఒక వ్యక్తిగా చెబుతున్నాను.
బిరుదులు, ప్రశంసలనేవి వెలకట్టలేనివి. కానీ అవి కొన్నిసార్లు మన పని నుండి, మన కళ నుండి, మనం పంచుకునే బంధం నుండి మనల్ని కంఫర్ట్‌గా ఉండలేని పరిస్థితిని కల్పిస్తాయి. మన భవిష్యత్‌ను మనం ఊహించలేకపోవచ్చు. కానీ మనకున్న అన్ని పరిమితులను దాటి అందరితో ప్రేమను పంచుకోగలమని నేను నమ్ముతాను. ఎప్పటిలానే మీ సపోర్ట్ నాకు ఉంటుందని, అలాగే మిమ్మల్ని అలరించడానికి నేనెప్పుడూ కష్టపడుతూనే ఉంటానని సంతోషంగా చెప్పగలను. సినిమా మనందరినీ ఐక్యంగా ఉంచుతుంది. దానిని మనమంతా ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుందాం. ప్రేమ, గౌరవం, కృతజ్ఞతలతో- మీ నయనతార’’ అంటూ ‘నయనతార ఎల్లప్పుడూ నయనతార మాత్రమే’ అని ఈ లేఖలో చెప్పుకొచ్చింది నయన్.
Also Read: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?