Merry Christmas First Review: విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి క్రేజ్‌ గురించి అందరికి తెలిసిందే. తమిళ్‌ హీరో అయిన ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. నటుడిగా కెరీర్‌ ప్రారంభించి హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కథ డిమాండ్‌ మేరకు ప్రస్తుతం వరుసగా విలన్‌ రోల్స్‌ చేస్తూ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. భాష ఏదైనా స్టార్‌ హీరో సినిమాలో విలన్‌ పాత్ర అంటే మేకర్స్‌ అంతా విజయ్‌ సేతుపతి వైపే చూస్తున్నారు. ఆ రేంజ్‌లో ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న విజయ్‌ సేతుపతి క్రేజ్‌ ఇప్పుడు బాలీవుడ్‌కు సైతం పాకింది. దీంతో ఆయనకు అక్కడ కూడా వరస ఆఫర్లు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే హిందీలో.. 'ఫర్జీ' సినిమాలో పవర్ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందిన ఆయన రీసెంట్‌గా షారుఖ్‌ ఖాన్‌ 'జవాన్‌'తో విలన్‌గా తన మార్క్‌ చూపించాడు.


ఇప్పుడు 'మేరీ క్రిస్మస్‌'తో హీరోగా బాలీవుడ్‌ ప్రక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. 'బద్లాపూర్', 'అంధాధున్' ఫేమ్ శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్‌తో జతకట్టాడు విజయ్‌. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సంక్రాంతి స్పెషల్ గా హిందీ, తమిళ భాషల్లో జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రివ్యూ చూసిన లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార భర్త, తమిళ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ తన ఫస్ట్‌ రివ్యూ ప్రకటించాడు. మేరీ క్రిస్మస్‌ ప్రివ్యూ చూసి సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఈ సందర్భంగా డైరెక్టర్‌  శ్రీరామ్‌ రాఘవన్‌ మేకింగ్‌ను కొనియాడుతూ.. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ యాక్టింగ్‌ ఫిదా అయ్యానన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో మేరీ క్రిస్మస్‌ గురించి ఇలా రాసుకొచ్చాడు.


'విజయ్‌, కత్రినాల నటనకు ఫిదా..!' 


"మేధావి శ్రీరామ్ రాఘవన్ నుండి అద్భుతంగా వ్రాసిన ఈ థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల అద్భుత నటన నన్ను సర్‌ప్రైజ్‌ చేసింది. ఇది ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ కాలానికి తిరిగి తీసుకువెళుతుంది. ఇక ప్రీతమ్ సంగీతం నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. చివరి 30 నిమిషాలు సినిమా చాలా బాగుంది! జనవరి 12 నుండి ఈ సినిమా థియేటర్లో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని చూసి గర్వపడుతున్నాను! ఆయన అసాధారమైన నటనతో మరోసారి అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. వన్‌ మ్యాన్‌ షో మేరీ క్రిస్మస్‌ను ఆయన నడిపించారు" అంటూ విఘ్నేష్‌ శివన్ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే హిందీ, తమిళ్‌ భాషల్లో జనవరి 12న వస్తున్న ఈ సినిమా తెలుగు మాత్రం కాస్తా ఆలస్యంగా విడుదల కానుంది.


ఈ సంక్రాంతికి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 'గుంటూరు కారం' సినిమాతో పాటు ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జల 'హనుమాన్‌' చిత్రాలతో పాటు మరిన్ని తెలుగు చిత్రాల పోటీ ఉండటంతో తెలుగులో 'మేరీ క్రిస్మస్‌'ను కాస్తా ఆలస్యంగా రిలీజ్‌ చేయనున్నారని సమాచారం. కాగా మ్యాచ్‌ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ & టిప్స్ ఇండస్ట్రీస్ బ్యానర్స్ పై రమేష్ తౌరానీస్, సంజయ్ రౌత్రే, జయ తౌరానీ, కేవల్ గార్గ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రీతమ్ సంగీతం సమకూర్చగా, మధు నీలకందన్సినిమాటోగ్రఫీ నిర్వహించారు. పూజా లధా సూర్తి ఎడిటర్ గా, మయూర్ శర్మ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేసారు. 'మేరీ క్రిస్మస్' సినిమా పొంగల్ కానుక‌గా 2024 జ‌న‌వ‌రి 12న గ్రాండ్‌ గా రిలీజ్ కాబోతోంది. 'జవాన్' సినిమాలో విలన్ గా నటించి బాలీవుడ్ జనాలను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి, ఇప్పుడు హీరోగా ఎలాంటి సక్సెస్ సాధిస్తారో చూడాలి.


 



Also Read: పుకార్లకు చెక్ పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ - 'పుష్ప2' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది!