Nayanthara's As Kumudha In Test Movie: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ప్రముఖ నటి నయనతార (Nayanthara), సిద్ధార్థ్, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ 'టెస్ట్' (Test). ఎస్.శశికాంత్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. నయన్ రోల్‌కు సంబంధించి స్పెషల్ వీడియోను టీం తాజాగా రిలీజ్ చేసింది. కుముద పాత్రలో నయనతార కనిపిస్తుండగా.. ఆమె కల ఏంటో వివరిస్తూ సాగిన టీజర్ ఆకట్టుకుంటోంది. 'ఈ టీచర్‌కు ఫెయిల్యూర్ ఓ ఎంపిక కాదు. కుముద తన అత్యంత సవాల్‌తో కూడిన పరీక్షను ఎదుర్కోబోతోంది.' అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. 


డిఫరెంట్ రోల్‌లో..



ఈ మూవీలో నయనతార డిఫరెంట్‌ రోల్‌లో అలరించబోతున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. కుముద పాత్రలో టీచర్‌గా కనిపించబోతున్నారు. 'ఓ చిన్న కల. ఓ చిన్న ఇల్లు, భర్తతో గడిపే మధుర క్షణాలు, ప్రేమగా అమ్మ అనే పిలుపు' డైలాగ్‌తో స్టార్ట్ అయిన వీడియో ఆకట్టుకుంటోంది. అసలు కుముద కల ఏంటి..? టీచర్‌గా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి..? క్రికెట్ బ్యాక్ డ్రాప్‌కు ఓ టీచర్ ఎమోషన్‌కు ఉన్న సంబంధం ఏంటి.? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. 


Also Read: ఆ ఓటీటీలోకి 'బ్రహ్మా ఆనందం' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?


డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్ట్రీమింగ్


ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న 'టెస్ట్' మూవీ నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి రానుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అర్జున్‌గా సిద్ధార్థ్ నటిస్తుండగా.. ఆర్.మాధవన్ కీలక పాత్ర పోషించారు. చెన్నైలోని క్రికెట్ స్టేడియంలో టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ జరగడం, ఆ మ్యాచ్ వల్ల ముగ్గురు జీవితాల్లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? ఆ మ్యాచ్ చూడడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి సమస్యల్లో పడ్డారు? వాటిని ఎలా దాటారు? అనేదే 'టెస్ట్' కథాంశం. సినిమా కథ మొత్తం ఒకే రోజు జరుగుందని తెలుస్తోంది.


డైరెక్టర్‌గా మారిన నిర్మాత


ఈ మూవీతోనే శశికాంత్ డైరెక్టర్‌గా మారారు. ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే.. మరోవైపు చక్రవర్తి రామచంద్రంతో కలిసి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఆయనే రచయితగా కూడా వ్యవహరించారు. 'ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది ఒక పెద్ద టెస్ట్. ఆలోచనలు, తీసుకునే నిర్ణయాల ఎఫెక్ట్ లైఫ్‌పై ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాం. అదే అన్నింటికంటే పెద్ద పరీక్ష.' అని పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. గతేడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకే రిలీజ్ అవుతోంది.


నయనతార ప్రస్తుతం 'మూకుత్తి అమ్మన్ 2'లో నటిస్తున్నారు. కన్నడలో టాక్సిక్, మలయాళంలో డియర్ స్టూడెంట్, తమిళంలో మన్నంగ్‌కట్టి, రక్కై సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ దూసుకెళ్తున్నారు.