Mokshagna Debut Movie Budget: కథానాయకుడిగా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ పరిచయానికి రంగం సిద్ధమైంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమా అనౌన్స్ చేశారు. ఆ మూవీ బడ్జెట్ ఎంత? ఆ సినిమాకు మోక్షజ్ఞ రెమ్యూనరేషన్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే...
వంద కోట్ల నిర్మాణ వ్యయంతో మోక్షజ్ఞ సినిమా
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (Prasanth Varma Cinematic Universe)లో మోక్షజ్ఞ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఆ యూనివర్స్‌లో వచ్చిన 'హనుమాన్' భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా సక్సెస్ కొట్టింది. అది పక్కన పెడితే నందమూరి వారసుడి సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అవి అన్నీ దృష్టిలో పెట్టుకుని భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కించాలని ప్రశాంత్ వర్మ రెడీ అయ్యారట. నిర్మాత సుధాకర్ చెరుకూరి సైతం ఖర్చు విషయంలో రాజీ పడే అవసరం లేదని దర్శకుడికి చెప్పారట. ఆల్రెడీ వంద కోట్ల బడ్జెట్ కేటాయించారట.
మొదటి సినిమాకు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్!
వంద కోట్ల బడ్జెట్‌లో రూ. 20 కోట్లు మోక్షజ్ఞ రెమ్యూనరేషన్ అని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటి వరకు తెలుగులో తొలి సినిమాకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో మరొకరు లేరని టాక్. ఈ విషయంలో నందమూరి వారసుడు రికార్డ్ క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి. రెమ్యూనరేషన్ తర్వాత మెజారిటీ అమౌంట్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం స్పెండ్ చేయనున్నారని తెలిసింది.
మహాభారతం స్ఫూర్తితో.... అసలు కథ ఏమిటి?
భారతీయ పురాణ ఇతిహాస గ్రంథాల స్ఫూర్తితో సూపర్ హీరో సినిమాలు తీస్తానని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. రామాయణంలోని హనుమంతుని స్ఫూర్తితో 'హను మాన్' తీశారు ఆయన. ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ తేజ సినిమాను మహాభారతం స్ఫూర్తితో తీస్తున్నారని సమాచారం. అభిమన్యుడి పాత్ర స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ డిజైన్ చేశారట.
నందమూరి మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమా కథ లాక్ చేశారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా వరకు పూర్తి అయ్యాయని, అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతున్నారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
నిర్మాతగా మారుతున్న బాలకృష్ణ చిన్న కుమార్తె
తమ్ముడు మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం అవుతున్న సినిమాతో బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఆమె సమర్పణలో లెజెండ్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్‌వి సినిమాస్ సంస్థలపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేవలం నందమూరి అభిమానులలో మాత్రమే కాదు... యావత్ తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.
Also Read: 'ధూమ్ 4'లో సూర్య... బాలీవుడ్ సినిమాలో విలన్‌గా రోలెక్స్‌కు ఛాన్స్?