Samarasimha Reddy Re Release: నందమూరి బాలకృష్ణ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా మూవీ లవర్స్ అంతా బాలయ్య సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ఏ జానర్ అయినా బాలయ్య సినిమా అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్‌ని మెప్పించే కంటెంట్ ఆయన సినిమాలో ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే ఆయన సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి ఫ్యాక్షన్ సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా సమరసింహారెడ్డి. 1999లో సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. సంక్రాంతికి ఉండే భారీ పోటీని తట్టుకుని పండగా విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.
విడుదలైన అన్ని ఏరియాల్లో బక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తన పేరిట రాసుకుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన కలెక్షన్స్‌తో చాలా థియేటర్లు లాభాలతో రీ మోడలింగ్, సౌండ్ సిస్టం ఆధునీకరించుకున్నాయంటూ వచ్చిన కథనాలు లెక్క మించి ఉన్నాయంటే ఈ మూవీ ఎంతగా ఆకట్టుకుందనేది చెప్పనవసరం లేదు. ఫ్యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన బాలయ్యను ఆ జానర్‌కు పరిచయం చేసింది ఈ సినిమానే. విడుదలైన 29 కేంద్రాల్లో ఈ మూవీ సిల్వర్ జూబిలీ జరుపుకోవడం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరించింది. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను చూసిన బాలయ్య కెరీర్‌లోనే 'సమరసింహారెడ్డి' ఆల్‌టైం రికార్డుగా నిలిచింది.
'సమరసింహారెడ్డి'గా బాలయ్య విశ్వరూపం, అబ్బులుగా.. ఫస్ట్‌హాఫ్‌లో కామెడీ, ఎమోషన్స్ పండించిన విధానం, సిమ్రాన్, అంజలా ఝవేరిల గ్లామర్, మణిశర్మ అదిరిపోయే సంగీతం వెరసి.. ఇదో కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. ఈ సినిమా క్రేజ్ తో ఫ్యాక్షన్ ని ఆధారంగా చేసుకుని తర్వాత వందకు పైగానే సినిమాలొచ్చాయి. అప్పట్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ కల్ట్ యాక్షన్ మూవీ ఇప్పుడు రీరిలీజ్‌కు రెడీ అవుతుంది. 25 ఏళ్ల బాక్సాఫీసు వద్ద సన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ మరోసారి థియేటర్లో రచ్చ చేసేందుకు రెడీ అవుతుంది. మార్చి 2 ప్రపంచవ్యాప్తంగా సమరసింహారెడ్డి థియేటర్లో రీసౌండ్ ఇవ్వబోతోంది. రీ మాస్టర్ చేసిన ప్రింట్ తో పాటు 7.1 డాల్బీ సౌండ్ లో మూవీని విడుదల చేయబోతున్నారు.
Also Read: 'ఈగల్' కొత్త ట్రైలర్ చూశారా? - పద్దతిగా దాడి చేసిన రవితేజ
ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసి రీ రిలీజ్ చేస్తుందట. ఈ రీ రిలీజ్ సందర్భంగా వచ్చిన డబ్బులను నందమూరి బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఇవ్వనున్నట్టు సదరు నిర్మాణ సంస్ధ తెలిపింది. సమరసింహారెడ్డి రీరిలీజ్ అవుతుందని తెలిసి బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. థియేటర్లో మరోసారి కాక రేపేందుకు ఫ్యాన్స్ అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. 1999లో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని చెంగల వెంకట్రావు నిర్మించారు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ఇందులో అన్ని పాటలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఈ మూవీ అప్పట్లోనే రూ. 22 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. సిమ్రాన్, అంజలా ఝవేరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి, పృథ్వీరాజ్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలో నటించారు.