క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాల్లో ఎంతో కీలకంగా ఉంటారు. అలాంటి వారి ద్వారానే స్టార్ హీరోలు, హీరోయిన్లు ఎలా ఉంటారు, అసలు సినిమా సెట్స్‌లో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు బయటపడతాయి. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో నాగినీడు ఒకరు. అసలు నాగినీడు అనగానే చాలామంది ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘మర్యాదరామన్న’. ఆ తర్వాత కూడా పలు గుర్తుండిపోయే పాత్రలు చేసిన నాగినీడు.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రవర్తన గురించి బయటపెట్టారు. ‘గబ్బర్‌సింగ్’లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన నాగినీడు.. ఆ సినిమా అనుభవాలను గుర్తుచేసుకున్నారు. 2002 నుండే సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నారు నాగినీడు. కానీ ఆయనకు ఒక నటుడిగా గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాదరామన్న’. ఆ తర్వాత వరుసగా ఆయనకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వచ్చాయి. అందులో హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘గబ్బర్‌సింగ్’ కూడా ఒకటి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో నాగినీడు నటించారు.


సాధారణ వ్యక్తిలా ఉంటాడు..
'‘పవర్ కళ్యాణ్ పెద్ద హీరో అయినా కూడా ఆయన ప్రవర్తనలో ఏమీ తేడా ఉండదు. ఏదో సాధారణ వ్యక్తిలాగా వస్తాడు, వెళ్తాడు. కానీ సైలెంట్‌గా ఉంటాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. ఎవరో ఒక వ్యక్తిని మాత్రమే కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ, చర్చిస్తూ ఉంటాడు. డైరెక్టర్‌తో మామూలుగా మాట్లాడతాడు. కానీ ఇంకెవరితో ఎక్కువగా మాట్లాడడు. నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి, పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మాట్లాడి, పలకరించి వస్తాను. కానీ ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో నా క్యారెక్టర్‌కు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు.. వచ్చి ఆయన డైలాగులు చెప్తాడు. డైలాగులు చెప్పిన తర్వాత నా చేయి పట్టుకొని ముద్దుపెట్టుకుంటాడు. ఆ సందర్భంలో అనుకోకుండానే నాకు ఒక సొంత కొడుకు చేశాడు అనే ప్రక్రియలోకి వెళ్లిపోయాను. దానికి స్పందన కూడా అలాగే వచ్చింది. అక్కడ గొప్పదనం పవన్ కళ్యాణ్ గారిదే. ఎప్పుడైనా ఒక నటుడు రాణించాలంటే.. ముందుగా పక్కన ఉన్న నటుడు రాణించాలి. నా వల్ల ఒకరు చేయాలి. ఒకరి వల్ల నేను చేయాలి. నా ఒక్కరితోనే ఏదీ కాదు.’' అంటూ ‘గబ్బర్‌సింగ్‌’లోని ఒక సీన్‌ను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు నాగినీడు.


నటన అద్భుతంగా ఉంది..
‘గబ్బర్‌సింగ్’లోని ఒక సీన్‌కు వచ్చిన స్పందన చూసి డైరెక్టర్ కూడా చాలా ఫీల్ అయ్యాడని నాగినీడు గుర్తుచేసుకున్నారు. ‘'నాగినీడు గారు హీరోతో ఇంకా రెండు షాట్స్ ఉన్నాయి. అయిన తర్వాత మీతో ఇంకా తీయాలి అని నన్ను ఆపాడు. హీరో సీన్స్ అయిపోయాక వెళ్లిపోయారు. 20 నిమిషాల తర్వాత మళ్లీ వచ్చారు. ఏం చెప్పారో కూడా గుర్తులేదు. ఆ తర్వాత సీన్ కోసం మేము కలిసినప్పుడు మొన్న ఏదో చెప్పారు. సరిగా వినిపించలేదు అని పవన్ కళ్యాణ్‌తో అన్నాను. నేను కూడా అదే విషయం చెప్పానండి అని ఆయన అన్నారు. మీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది అని చెప్పడానికే వచ్చాను’' అని పవన్ కళ్యాణ్ అన్నారు అని తెలిపారు నాగినీడు.


Also Read: పుష్ప గాడి రూలు మొదలయ్యేది అప్పుడే - మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial