ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, అలాగే రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ సోమవారం (మే 13న) ఎన్నికలు పూర్తి అయ్యాయి. అధికారంలోకి వైసీపీ పార్టీ తామే మరోసారి పగ్గాలు చేపడతామని ధీమాగా ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన కూటమి తాము అధికారంలో రావడం ఖాయమని, ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకు అనుగుణంగా తమకు ఓటు వేశారని బలంగా చెబుతున్నారు. ఎవరు అధికారంలోకి వస్తారు? అనేది పక్కన పెడితే... జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీలో క్రియాశీలక సభ్యులు కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో కాక రేపుతోంది.
మనోడు... పరాయివాడు... ట్వీట్ చూశారా?
''మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడు అయినా పరాయివాడే. మాతో నిలబడే వాడు పరాయివాడు అయినా మావాడే...!'' అని సోమవారం రాత్రి నాగబాబు ట్వీట్ చేశారు. అంతకు మించి ఆయన ఏమీ పేర్కొనలేదు. పైగా, ఏపీలో పోలింగ్ అంతా ముగిశాక రాత్రి పది గంటల సమయంలో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆయన ఎవరిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారనేది హాట్ టాపిక్ అయ్యింది.
మేనల్లుడు బన్నీని టార్గెట్ చేసిన నాగబాబు?
నాగబాబు ట్వీట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను టార్గెట్ చేస్తూ చేసినది అని పలువురు నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఏపీ ఎన్నికలు జరిగాయి. అయితే, వైసీపీకి జనసేనకు మధ్య ప్రచార పోరు ఉప్పు నిప్పు అన్నట్టు సాగింది. వైసీపీని అధికారం నుంచి దించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఆయనకు సినిమా పరిశ్రమ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశారు. కాని ప్రచారం ముగింపు రోజు వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్ప రవి ఇంటికి వెళ్లారు. దీన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి.
Also Read: మెగా డాటర్ నిహారిక కొణిదెల మాజీ భర్త చైతన్య సెన్సేషనల్ పోస్ట్... జనసేనకు ఆయన వ్యతిరేకమా?
వైసీపీతో పవన్ పోరాడుతుంటే ఆ పార్టీ అభ్యర్థి ఇంటికి బన్నీ వెళ్లడం ఏమిటని మెగా ఫ్యాన్స్, రాజకీయ కార్యకర్తలు ప్రశ్నించారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన బన్నీ ముందు ఈ ప్రశ్న ఉంచగా... పార్టీలతో తనకు సంబంధం లేదని, తనవాళ్లు ఏ పార్టీలో ఉన్నా సరే మద్దతు ఇస్తానని ఆయన వివరణ ఇచ్చారు. అది మెగా వర్గాలకు సంతృప్తికరంగా లేదని సమాచారం. ఆ అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగా నాగబాబు ట్వీట్ చేశారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ తమ కుటుంబ సభ్యుడు అయినా సరే తమకు పరాయివాడి కింద లెక్క అన్నట్టు ఆయన ట్వీట్ చేశారని, ఆ పోస్టులో నిగూఢ అర్థం అదేనని అనలిస్టులు సైతం ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేస్తున్నారు. అది పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేత వర్మను ఉద్దేశించి చేసిన ట్వీట్ అని కొందరు చెబుతున్నారు. నాగబాబు ట్వీట్ వెనుక ఏ ఉద్దేశం ఉందనేది ఆయనకు మాత్రమే ఎరుక.
Also Read: పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?