Nag Ashwin: ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు ప్రభాస్. అందుకే తన దగ్గర నుండి వచ్చే సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు ఆశించడం మొదలుపెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చే ఔట్‌పుట్ ఇవ్వాలని ప్రభాస్ కష్టపడడం మొదలుపెట్టాడు. తను మాత్రమే కాకుండా తన దగ్గరకు వచ్చే దర్శకులు కూడా అదే రేంజ్‌లో కథలను సిద్ధం చేసుకుంటున్నారు. అలా నాగ్ అశ్విన్ రాసుకున్న ‘కల్కి 2898 AD’ కథకు ప్రభాస్‌ను ఎంచుకున్నాడు. ప్రభాస్‌తో తన ప్రయాణం ఎలా సాగిందో చెప్తూ ఒక ఫోటోను షేర్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్.


ఏడాదిన్నర తర్వాత..


‘సాహో’ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌ను ఓకే  చేస్తూ వచ్చాడు ప్రభాస్. అందులో ‘కల్కి 2898 AD’ కూడా ఒకటి. కానీ ముందుగా ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ ప్రారంభమయ్యింది. అలాగే ‘ప్రాజెక్ట్ కె’గానే ఇది ఫేమస్ అయ్యింది. ఎక్కువగా టెక్నాలజీతో తెరకెక్కించాల్సిన మూవీ కావడంతో మిగతా సినిమాలకంటే ‘కల్కి 2898 AD’ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయించాడు ప్రభాస్. అలా నాగ్ అశ్విన్, ప్రభాస్.. దాదాపు ఏడాదిన్నరగా కలిసి పనిచేస్తున్నారు. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్‌తో మాత్రమే తాను ఇలాంటి కథను తెరకెక్కించగలను అని మొదట్లోనే తెలిపాడు నాగ్ అశ్విన్. తాజాగా ‘కల్కి 2898 AD’ కోసం తాను ఎంత కష్టపడ్డాడో ఒక్క ఫోటోతో బయటపెట్టాడు.


నాగ్ అశ్విన్ సర్‌ప్రైజ్..


నాగ్ అశ్విన్ తాజాగా తన చెప్పుల ఫోటోను షేర్ చేశాడు. అందులోని చెప్పులు చిరిగిపోయి ఉన్నాయి. ఆ ఫోటోతో పాటు ‘ఇది చాలా పెద్ద ప్రయాణం’ అంటూ క్యాప్షన్ కూడా యాడ్ చేశాడు. అంటే ‘కల్కి 2898 AD’ కోసం తాను ఎంత కష్టపడ్డాడో అందరికీ అర్థమవ్వడం కోసమే ఈ యంగ్ డైరెక్టర్.. ఇలా చిరిగిపోయిన చెప్పుల ఫోటోను షేర్ చేశాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అసలైతే నాగ్ అశ్విన్.. ఈ రేంజ్‌లో ‘కల్కి 2898 AD’ని తెరకెక్కిస్తాడని చాలామంది ప్రేక్షకులు ఊహించలేదని, చూడగానే తన టేకింగ్ చూసి షాకయ్యామని అంటున్నారు. అంతే కాకుండా ఇలాంటి డిఫరెంట్ సినిమా.. ఇప్పటివరకు తెలుగులో రాలేదని ప్రశంసిస్తున్నారు.


పర్ఫెక్ట్ కాంబో..


‘కల్కి 2898 AD’ కోసం సైన్స్ ఫిక్షన్‌ను, మైథాలజీని పర్ఫెక్ట్‌గా మిక్స్ చేశాడు నాగ్ అశ్విన్. కలియుగంలో విష్ణుమూర్తి చివరి అవతారాన్ని కల్కి అంటారు. ఆ రిఫరెన్స్‌తోనే ఈ సినిమాకు ‘కల్కి 2898 AD’ అని టైటిల్‌ను పెట్టాడు. ఈ మూవీ కోసం దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్లను ఒక దగ్గరకు చేర్చాడు. అందరి పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నాడు. ముఖ్యంగా ఇందులో మహాభారతం రిఫరెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఇంప్రెస్ చేస్తున్నాయి. పైగా ప్రతీ ముఖ్యమైన పాత్ర కోసం స్టార్లతో గెస్ట్ రోల్స్ చేయించడం కూడా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అలా మొదటిరోజే ‘కల్కి 2898 AD’ చూసినవారంతా నాగ్ అశ్విన్‌పై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.



Also Read: నిలబడి మరీ చప్పట్లు కొట్టిన ప్రేక్షకులు - థియేటర్లలో ‘కల్కి 2898 AD’ క్రేజ్ మామూలుగా లేదుగా!