Venkatesh Daggubati Old Interview: విక్టరీ వెంకటేష్. బీభత్సమైన సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మూవీ మొఘల్ రామా నాయుడు సినిమా పరిశ్రమను ఏలుతున్న సమయంలో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. 1986లో ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, వరుస హిట్లతో స్టార్ హీరోగా ఎదిగారు. సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికీ సత్తా చాటుతున్నారు.


నాన్న ఉన్నాడనే కారణంగా ఇండస్ట్రీలోకి రాలేదు- వెంకటేష్


తాజాగా వెంకటేష్ కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆయన దూరదర్శన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు చెప్పారు. తన తండ్రి ఇండస్ట్రీలో ఉన్నాడు, అవకాశాలు వస్తాయనే కారణంతో సినిమా పరిశ్రమలోకి రాలేదని వెంకటేష్ వెల్లడించారు. “మా నాన్న సినిమా రంగంలో ఉన్నారనే కారణంగా నేను సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టలేదు. నాకు చిన్నప్పటి నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది. కనీసం డిగ్రీ అయినా తీసుకోవాలి అనుకున్నాను. అందుకే ఎంబీఏ పూర్తి చేశాను. ఆ తర్వాతే సినిమాల్లోకి రావాలి అనుకున్నాను. దేవుడు రాసిన రాత అనుకుంటున్నాను. 1986లో ‘కలియుగ పాండవులు‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చాను” అన్నారు.


సినీ కెరీర్‌ను బిజినెస్‌లా తీసుకున్నాను- వెంకటేష్


తాను సినిమా కెరీర్ ను కూడా బిజినెస్ లా తీసుకున్నట్లు వెంకటేష్ తెలిపారు. “ఏ బిజినెస్ అయినా హార్డ్ వర్క్ అనేది ఉండాలి. సినిమాల్లో నటించేటప్పుడు చాలా హోం వర్క్ చేస్తాను. స్క్రిప్ట్ చదువుతాను. యాక్టింగ్ చేసేటప్పుడు, శ్రద్ధ, క్రమశిక్షణ కలిగి ఉంటాను. సినిమా పరిశ్రమలో ఉన్న కాంపిటీషన్ కు హార్డ్ వర్క్ లేకపోతే తట్టుకోవడం కష్టం” అన్నారు.


ఫైట్స్ అలా చేస్తేనే బాగుంటుంది- వెంకటేష్


“నా సినిమాల్లో ఫైట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. డూప్ లేకుండా నటించేందుకు ప్రయత్నిస్తాను. అలా చేయడం వల్ల కొన్ని లాభాలున్నాయి. కొన్ని నష్టాలున్నాయి. ఆడియెన్స్ ఫైట్ ఫీలింగ్ పొందాలంటే మేం చేస్తేనే బాగుంటుంది. అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. 95 శాతం నేనే ఫైట్స్ చేస్తాను.‘బొబ్బిలి రాజా‘ సినిమా యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్నప్పుడు చాలా దెబ్బలు తగిలాయి. డూప్ పెట్టాలి అనుకున్నాం. కానీ, నేనే చేశాను. మెడకు దెబ్బ తగిలింది. తప్పనిసరి పరిస్థితుల్లో డూప్ ను వాడాల్సి వచ్చింది” అని చెప్పుకొచ్చారు.


చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం


“డ్యాన్స్ నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. సినిమాలకు వచ్చే సరికి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కో మ్యూజిక్ బిట్ కు ఒక్కోలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. హీరోయిన్ తో కలిసి చేసేటప్పుడు మరోలా ఉంటుంది. డిఫరెంట్ గా ఎలా చేయాలా? అని ప్రయత్నిస్తాను” అని వెంకటేష్ చెప్పుకొచ్చారు.


వెంకటేష్ చివరగా 'సైంధవ్' సినిమాలో కనిపించారు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అటు కలెక్షన్స్ కూడా పూర్తిగా నిరాశపరిచాయి. 'సైంధవ్' ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 


Read Also: బతికి ఉన్న మా నాన్నను ఈ లోకం విడిచి వెళ్లిపో అన్నాను - తండ్రి మృతిపై మనోజ్‌ బాజ్‌పాయి ఎమోషనల్‌