సంగీత దర్శకుడు రాజ్ మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఈ సమాచారం తెలిసి మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా రాజ్‌కు నివాళులు అర్పించారు. తాను ఎన్నో సినిమాలకు చక్కని సంగీతాన్ని అందించిన రాజ్‌ ఇక లేరనే విషయం తనని దీగ్భ్రాంతికి గురిచేసిందని చిరంజీవి అన్నారు. 


రాజ్ మరణం దీగ్భ్రాంతికి గురిచేసింది: చిరంజీవి


‘‘ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం  దిగ్భ్రాంతికి  గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్, నా కెరీర్ తొలి దశలలో నా  చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను  ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి’’ అని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 






తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీత ద్వయం ‘రాజ్-కోటి’. తన స్నేహితుడు కోటితో కలిసి ఎన్నో సినిమాలకు మంచి స్వరాలు అందించిన రాజ్(65).. ఆదివారం మరణించారు. బాత్రూమ్‌లో కాలు జారడం వల్ల ఆయన గుండె పోటుకు గురయ్యారని, హాస్పిటల్‌కు తరలించే లోపే ఆయన కన్ను మూశారని రాజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్ మరణ వార్త యావత్ టాలీవుడ్‌ను విషాదంలో నింపేసింది. 


రాజ్‌కు ముగ్గురు కుమార్తెలు దీప్తి, దివ్య, శ్వేత ఉన్నారు. దివ్య టాలీవుడ్‌లో అసోషియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మూడో అమ్మాయి శ్వేత మలేషియాలో ఉంటున్నారు. సోమవారం ఆమె ఇండియాకు చేరగానే మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 


90వ దశకంలో రాజ్-కోటి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి పాటా హిట్టే. దీంతో వారికి అప్పట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే, స్పర్థల వల్ల వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత కోటి మాత్రమే సంగీత దర్శకుడిగి నిలదొక్కుకున్నారు. రాజ్ దాదాపు టాలీవుడ్‌కు దూరమయ్యారు. రాజ్ సంగీత దర్శకులు టి.వి.రాజు కుమారుడు. టీవీ రాజు కూడా సంగీత దర్శకుడు. ఈయనకు సీనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మాద్రాసులో సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఉండేవారట. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. 


రాజ్ కోటి కలిసి సంగీతం అందించిన ఫస్ట్ మూవీ ‘ప్రళయ గర్జన’. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్ వంటి సినిమాలకు అందించిన పాటలు ఎంతగా హిట్ అయ్యాయో తెలిసిందే. ఇద్దరు కలిసి సుమారు 150 వరకు సినిమాలకు సంగీతం అందించారు. కోటీతో విడిపోయిన తర్వాత రాజ్ ‘సిసింద్రీ’, ‘రాముడొచ్చాడు’ సినిమాలకు సంగీతం అందించారు. వెంకటేష్ నటించిన ‘ప్రేమంటే ఇదేరా’ మూవీకి నేపథ్య సంగీతాన్ని అందించారు. 


Also Read: ‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా’ అన్న రాజ్-కోటీలు ఎందుకు విడిపోయారు?