Mufasa: The Lion King Trailer Is Out Now: హాలీవుడ్‌లో తెరకెక్కే యానిమేషన్ చిత్రాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఇష్టపడతారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న యానిమేషన్ చిత్రాల్లో ‘లయన్ కింగ్’ కూడా ఒకటి. ఇప్పుడు ఆ ‘లయన్ కింగ్’కు సంబంధించిన ప్రీక్వెల్ ‘ముఫాస: ది లయన్ కింగ్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. తాజాగా దీని ట్రైలర్ విడుదలయ్యింది. అసలు ముఫాస.. ఒక సాధారణ లయన్‌గా పుట్టి, తర్వాత లయన్ కింగ్ ఎలా అయ్యాడు అనేది ‘ముఫాస: ది లయన్ కింగ్’ కథ. మూవీ అంతా ఇదే కథపై ఆధారపడి ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ప్రీక్వెల్ కథతో..
‘లయన్ కింగ్’లో ముఫాసను సింహాలకు రాజుగా చూపించారు. ఆ తర్వాత తనకు సింబా అనే కొడుకు పుట్టడంతో తర్వాత సినిమా కథ అంతా సింబా చుట్టూ తిరుగుతుంది. కానీ అసలు ముఫాస.. లయన్ కింగ్ ఎలా అయ్యాడు, లయన్ కింగ్‌గా ఎలా పేరు సంపాదించుకున్నాడు అనేది ‘ముఫాస: ది లయన్ కింగ్’లో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ మూవీని మూన్‌లైట్ దర్శకుడు బ్యారీ జెన్కిన్స్ తెరకెక్కించారు. 1994లో విడుదలయిన డిస్నీ యానిమేటెడ్ క్లాసిక్ అయిన లయన్ కింగ్‌ను పూర్తిస్థాయి సినిమాలాగా మార్చి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. కానీ మేకర్స్ అందులో ఇప్పటికే సక్సెస్ అయ్యారు. మరోసారి ప్రీక్వెల్ ‘ముఫాస: ది లయన్ కింగ్’తో ఆ సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగించడానికి వచ్చేస్తున్నారు.
అతడే ముఫాస..
‘ముఫాస: ది లయన్ కింగ్’ ట్రైలర్ ప్రారంభమవ్వగానే.. అందమైన మంచు ప్రాంతంలో మొదలవుతుంది. కోతి క్యారెక్టర్ అయిన రఫీకి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ‘వెలుగుకు మరోవైపు, కొండలకు చాలా దూరంలో ఈ కథ మొదలవుతుంది. అక్కడ ఒక సింహం జన్మించింది. అదే సింహం మన జీవితాలను ఎప్పటికీ మార్చేస్తుంది. ‘ముఫాస: ది లయన్ కింగ్’ ట్రైలర్‌ను బట్టి చూస్తే ‘లయన్ కింగ్’లో ఉండే చాలావరకు పాత్రలు.. ఈ మూవీలో కూడా ఉంటాయని అర్థమవుతోంది. ఆ తర్వాత ఆ అడవిలోనే ముఫాస.. ఎలా స్నేహితులను చేసుకుంటాడు, దాంతో తన జీవితం ఎలా మారుతుంది అనే అంశాలపై చిన్న గ్లింప్స్‌ను చూపించారు.
డిసెంబర్‌లో విడుదల..
‘ముఫాస: ది లయన్ కింగ్’ ట్రైలర్‌లో సింహం చేసే సాహసాలను కూడా ప్రేక్షకులు మెప్పించేలా చూపించాడు దర్శకుడు బ్యారీ జెన్కిన్స్. ఇందులో రఫీకిగా జాన్ కానీ, పుంబాగా సేథ్ రాగెన్, టిమాన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్రోవెర్ గొంతులు వినిపించనున్నాయి. ముఫాసగా ఆరోన్ పైర్రీ వాయిస్ వినిపించనుంది. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ‘ముఫాస: ది లయన్ కింగ్’ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ ఇప్పుడే ప్రకటించేశారు. కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. కానీ ఇతర భాషా రిలీజ్‌లపై ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్.