Kushboo Sundar At Baak Pre Release Event: తమిళంలోని హాట్ సినిమా ఫ్రాంచైజ్‌లలో ‘అరణ్మనై’ కూడా ఒకటి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడు సినిమాలు విడుదల కాగా.. త్వరలోనే ‘అరణ్మనై 4’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇతర సినిమాలలాగానే ‘అరణ్మనై 4’ను కూడా తెలుగులో డబ్ చేశారు మేకర్స్. తెలుగులో ‘బాక్’గా ఈ మూవీ విడుదల కానుండగా.. తాజాగా ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. కానీ ఈ ఈవెంట్‌కు దర్శకుడు సుందర్ రాకపోగా.. తన భార్య ఖుష్బూ తన తరపున వచ్చి ప్రేక్షకులతో ముచ్చటించారు.
నేనే ఇన్‌స్పిరేషన్..
డైరెక్టర్ సుందర్.సి ఆరోగ్యం బాలేదని, ఆసుప్రతిలో ఉన్నారని, అందుకే ‘బాక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేకపోయారని క్లారిటీ ఇచ్చారు ఖుష్బూ. ‘‘అరణ్మనైలో దెయ్యాన్ని అంత బాగా దెయ్యాన్ని చూపించారంటే.. ఇంట్లో నేను ఒక దెయ్యాన్ని ఉన్నాను. నన్ను చూసే ఇన్‌స్పైర్ అవుతారు’’ అంటూ ఫన్నీగా తన స్పీచ్‌ను ప్రారంభించారు ఖుష్బూ. ఆ తర్వాత తన భర్త సుందర్ గురించి చెప్తూ.. తనకు అందరినీ ఎంటర్‌టైన్ చేయడం ఇష్టమని, ఎక్కువగా ఒంటిగానే ఉండడం ఇష్టమని బయటపెట్టారు. ఒకే టైటిల్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి హిట్లు కొట్టడం ఈజీ కాదని, ‘అరణ్మనై 4’ కూడా బాగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు ఖుష్బూ.
డిస్టర్బ్ అవుతారు..
‘అరణ్మనై 4’కు తెలుగులో ‘బాక్’ అనే డిఫరెంట్ టైటిల్ పెట్టడానికి కారణమేంటి అని కూడా ఖుష్బూ బయటపెట్టారు. ‘‘అరణ్మనై 4 తీయాలని డిసైడ్ అయిన తర్వాత ప్రతీసారిలా రివెంజ్ డ్రామాలాగా కాకుండా డిఫరెంట్‌గా ఉండాలని సుందర్ రీసెర్చ్ చేశారు. అప్పుడే అస్సాంలో బాక్ అనే దెయ్యం ఉందని ఆయనకు తెలిసింది. అసలు అది ఏంటో సినిమాలో మీకు క్లియర్‌గా చెప్తాం. మామూలుగా సుందర్ సినిమా షూటింగ్స్‌కు తాను వెళ్లనని, డిస్టర్బ్ అవుతారని అన్నారు ఖుష్బూ. కానీ ‘అరణ్మనై 4’ షూటింగ్ సమయంలో తన పెళ్లిరోజు ఉండడంతో సర్‌ప్రైజ్ చేయడానికి ఒకసారి సెట్‌కు వెళ్లానని బయటపెట్టారు. కానీ అప్పుడే తనకు కోవిడ్ పాజిటివ్ అని తెలియడంతో తిరిగి వచ్చేశానని అన్నారు.
అందరికీ థ్యాంక్స్..
తనకు, సుందర్‌కు ఎప్పుడెప్పుడు గొడవలు అవుతాయని ప్రశ్నించగా.. ఎక్కువగా పిల్లల విషయంలోనే అవుతాయని సమాధానమిచ్చారు ఖుష్బూ. అంతే కాకుండా సుందర్‌కు ఎక్కువగా కోపం రాదని, వచ్చినప్పుడు మాత్రం తిరిగి సమాధానమిస్తే ఆయనకు నచ్చదన్నారు. ‘‘ఆయనకు కోపం వచ్చినప్పుడు టేబుల్ వెనకాలకు వెళ్లి.. దాక్కొని అసలు కనిపించను’’ అని నవ్వుతూ చెప్పారు ఖుష్బూ. సుందర్ టీమ్‌లో కూడా చాలా కొంతమందికి మాత్రమే ఆయన కోపం గురించి తెలుసన్నారు. ‘అరణ్మనై’ ఫ్రాంచైజ్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు అంటారని గర్వంగా చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమాలో భాగమయిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకున్నారు ఖుష్బూ. మే 3న హారర్ కామెడీ ‘బాక్’ థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read: స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల - మాట నిలబెట్టుకుంది అంటున్న ఫ్యాన్స్