Mohan Babu At Kannappa Teaser Launch: మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పుడు దీనిపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ స్టార్ క్యాస్టింగ్‌తో ఒక్కసారిగా ‘కన్నప్ప’పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లను కూడా తన సినిమా కోసం రంగంలోకి దించాడు మంచు విష్ణు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో ‘కన్నప్ప’ టీమ్‌తో పాటు మంచు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌లో సినిమా గురించి గొప్పగా మాట్లాడారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు.


అతిరథమహారథులు నటించారు..


‘‘కన్నప్ప సినిమా గురించి ఏం చెప్పాలి? చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి ఈ సినిమా ఎప్పుడూ కొత్తదే. కన్నప్పకు భక్తి భావం ఎలా వచ్చింది? ధూర్జటి మహాకవి దాని గురించి ఎలా రాశారు? శ్రీకాళహస్తీశ్వర మహత్యం అంటే ఏంటి? దాన్ని ముందుకు ఎవరు తీశారు? దాన్ని మళ్లీ వీళ్లు కొత్తగా ఏం చూపిస్తున్నారు? అనేది ఈ సినిమాలో చూపించాం. ఏ సినిమా తెరకెక్కించడం అయినా కష్టమే కానీ ఇందులోని అతిరథమహారథులు నటించారు. కేరళ, మద్రాస్, ఆంధ్ర, నార్త్ ఇండియా, మన భారతదేశంలో నలుమూలలా ఉన్న మహానటులు అందరినీ తీసుకొచ్చి ఈ సినిమాలో నటింపజేశాం. వాళ్లు ఏం చేశారు, ఎలా చేశారు చెప్తూ డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది’’ అని ‘కన్నప్ప’ క్యాస్టింగ్ గురించి మాట్లాడారు మోహన్ బాబు.


భక్తి చిత్రమే కాదు..


శరత్ కుమార్ గురించి చెప్తూ ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు అని, పార్టీ అధినేతగా ఉన్నారని గుర్తుచేశారు. ‘‘ఏ పాత్రను అయినా అవలీలగా చేయగల నటుడు, నాకు మంచి సోదరుడు’’ అని అన్నారు మోహన్ బాబు. అలాగే ‘కన్నప్ప’లో ప్రతీ ఒక్కరు బాగా చేశారని చెప్తూనే వాళ్లంతా ఎలా చేశారో ప్రజలే చెప్పాలని అన్నారు. ‘‘ఇది కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు. పరమేశ్వరుడి చరిత్ర’’ అని తెలిపారు. ఆ తర్వాత పరమేశ్వరుడి గురించి ఒక పద్యం చెప్పారు. ఒకప్పుడు ఈ పద్యాన్ని పెదబాలశిక్షలో చదువుకున్నానని, ఇప్పుడు అక్షరదోశాలు ఉండవచ్చేమో అన్నారు మోహన్ బాబు.


ఆశీస్సులు కావాలి..


‘‘మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలాగో పరమేశ్వరుడు కూడా అంతే. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మన ఇళ్లల్లో అంటుంటాం. మన అమ్మ, నాన్న చెప్పిన సామెత ఎన్నోసార్లు వినుంటాం. అలాగే ఆయన అనుమతి లేనిదే ఈ సినిమా తీసుండం. ఆ భగవంతుడి ఆశీస్సులతో సినిమా తీశాం. కన్నప్పకు సంబంధించిన ఎన్నో ఫంక్షన్స్ చూస్తారు. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా నా బిడ్డ విష్ణుకు, విష్ణుకు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నా’’ అంటూ తన స్పీచ్‌ను ముగించారు మోహన్ బాబు. ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇంటర్నేషన్ సెలబ్రిటీల ప్రశంసలు పొందిన ‘కన్నప్ప’ టీజర్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మందుకు వచ్చింది.


Also Read: మెగాస్టార్‌ను ఢీకొట్టబోతున్న బాలీవుడ్ యాక్టర్ - ‘విశ్వంభర’ నుంచి క్రేజీ అప్డేట్!