టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు. తన వైవిధ్యమైన నటన, డైలాగ్ డెలివరీతో కలెక్షన్ కింగ్ గా గుర్తింపు పొందారు. ఎన్నో విభిన్న కథలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపా దడపా సినిమాల్లో నటించినా అవి అంతగా ఆకట్టుకోవడం లేదు. అంతేకాదు ఈ మధ్య ఎక్కువగా మంచు ఫ్యామిలీ ట్రోల్స్ కు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మంచు మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో తనపై వస్తోన్న విమర్శలు, వివాదాల గురించి చెప్పుకొచ్చారాయన. 


సినిమా ఇండస్ట్రీలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని అన్నారు. ఒకానొక సమయంలో ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నానని చెప్పారు. తన పరిస్థితి పగోడికి కూడా రాకూడదన్నారు. అయితే తన కష్టాలను తానే అధిగమించానని, ఇప్పుడు యూనివర్సిటీ చాన్సలర్ వరకూ ఎదిగానని అన్నారు. తన బిడ్డలు కూడా అటు సినిమాలు ఇటు విద్యా రంగంలో కూడా రానిస్తున్నారని చెప్పారు. విష్ణు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నాడని, మనోజ్ ప్రస్తుతం 3 సినిమాల్లో బిజీగా ఉన్నాడని అన్నారు. ఇటీవలే మనోజ్ కు వివాహం జరిగిందన్నారు. ఇక కుమార్తె లక్ష్మీ కూడా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. 


నాకు అవార్డులు రాకుండా అడ్డుకున్నారు: మోహన్ బాబు


ఇండస్ట్రీలో తన గురువు దాసరి నారాయణరావు స్థానాన్ని ఎవరూ ఆక్యూపై చేయలేరని, ఆ స్థానంలో ఎవరైనా వచ్చినా తాను ఆనందంగా మద్దతు ఇస్తానని చెప్పారు. చిరంజీవికి అయినా తన సపోర్ట్ ఉంటుందని అన్నారు. అయినా ఇండస్ట్రీ అనేది ఒక్కరిదే కాదని,  ఇక్కడ అందరకీ నాయకత్వం ఉంటుందని అన్నారు. ఇక అవార్డుల గురించి మాట్లాడుతూ.. తనకు నంది అవార్డులు రాకుండా కొంత మంది అడ్డుకున్నారని అన్నారు. ‘పెదరాయుడు’ లాంటి సినిమాలకు నంది అవార్డులకై అప్లై చేస్తే.. అవార్డు రాకుండా మేనేజ్ చేశారని, వారికి కావాల్సిన వారికి అవార్డులు ఇచ్చుకున్నారని అన్నారు. తనకు ఒక్క అవార్డు కూడా రాకుండా ఎవరు అడ్డుకున్నారో తనకు తెలుసన్నారు. తన కుమారుడు మనోజ్ నటించిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాకు కూడా అవార్డు రావాల్సిందని, కానీ వేరే చెత్త  సినిమాకు ఇచ్చారని వ్యాఖ్యానించారు. అయినా మంచి నటుడికి అవార్డులతో పనిలేదని, ప్రజల అభిమానమే పెద్ద అవార్డు అన్నారు. 


మాది భార్యాభర్తల బంధం లాంటింది..


టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో జరిగిన వివాదం గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.. ఒక్కో సందర్భాల్లో ఆత్మీయుల మధ్య మాటల వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయని అన్నారు. అంతమాత్రానా వారు విరోధులు అయిపోరని అన్నారు. అది ఎప్పుడో జరిగిన విషయమని, తాను ఆ సంఘటనలు ఏమీ గుర్తుపెట్టుకోలేదన్నారు. ‘మా’ అసోషియేషన్ సందర్భంగా కూడా చిరంజీవికు తనకు మధ్య జరిగిన ఘర్షణను కూడా గుర్తు చేసుకున్నారు. అప్పుడు అలా జరిగి ఉండకూడదని అన్నారు. అందులో ఎవరిదీ తప్పని చెప్పలేమన్నారు. తర్వాత కూడా చిరంజీవి, తాను చాలా సార్లు ఎదురుపడ్డామని, మాట్లాడుకున్నామని చెప్పారు. ఇప్పుడు తాము బానే ఉన్నామని చెప్పుకొచ్చారు. 


‘జారుమిఠాయ’ పాటను చిరంజీవి కూడా వాడుకున్నారు..


‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను రాజమౌళి, కీరవాణిలకు ఫోన్ చేసి విష్ చేశానని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచమంతా చాటారని, అలాగే రాజమౌళి కూడా తెలుగు భాషను మరోసారి ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని అన్నారు. తెలుగు భాషా చాలా గొప్పదని అన్నారు. అందుకే విష్ణు ‘జిన్నా’ సినిమాలో కూడా జానపద గీతం ‘జారుమిఠాయ’ పాటను పెట్టామని అన్నారు. ఆ పాట ఎంతో పాపులర్ అయిందని పేర్కొన్నారు. ఆ పాటను చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కూడా వాడారని అన్నారు. చిరంజీవికి తనకూ మధ్య విభేదాలు లేవని ఈ పాటను చూస్తేనే అర్థమవుతుందని అన్నారు.