'అఖండ' వంటి భారీ విజయం తర్వాత ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన సినిమా 'పెదకాపు 1'. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ఇది. విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాత్సవ కథానాయిక. శ్రీకాంత్ అడ్డాల ఓ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 29న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ముచ్చటించారు. ఆ విశేషాలు... 


కొత్తవాళ్లతో వర్కవుట్ అయ్యే కథ
''పెద కాపు' చిత్రానికి ఇంత మంచి బజ్ రావడం చాలా ఆనందంగా ఉంది. మేం ముందు నుంచి ఇది పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతో పెద్దగా ప్లాన్ చేశాం. అందరూ కొత్త వాళ్ళతో సినిమా చేయడం రిస్క్ అనుకోలేదు. ఇది కొత్త వాళ్ళతోనే వర్క్ అవుట్ అయ్యే కథ. ఈ కథకు ఓ సామాన్యుడు కావాలి. అప్పుడు కథకు సహజత్వం వస్తుంది'' 


'అఖండ' తర్వాత నాలో డైలమా...
''అఖండ' లాంటి విజయం తర్వాత ఏం చేయాలనే డైలమా నాలో వచ్చింది. పెద్ద హీరోలు, దర్శకులకు అడ్వాన్సులు ఇవ్వాలని నా సన్నిహితులు సైతం ఒత్తిడి చేశారు. మనం ఎవరితో సినిమా చేసినా... మంచి కథ ఉన్నప్పుడు మంచి సినిమా అవుతుంది. స్టార్ యాడ్ అయితే అది ఇంకా పెద్ద సినిమా అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. మంచి కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో 'పెద కాపు' వచ్చింది. తెలుగు చిత్రసీమలో ఇదొక అరుదైన చిత్రంగా నిలుస్తుంది. దీని తర్వాత మా ద్వారక క్రియేషన్స్ ప్రయాణం మారుతుంది'' 


జీవితాన్ని తెరపై చూసిన అనుభూతి ఇస్తుంది!
''ప్రతి కథలో బలవంతుడు, బలహీనుడు మధ్య పోరాటం ఉంటుంది. 'పెద కాపు' చిత్రానికి నేటివిటీ కూడా తోడైయింది. అందువల్ల, ఈ కథను తెరపై చూస్తున్నపుడు ఓ సినిమాలా కాకుండా నిజ జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్ అడ్డాల గారు రాసిన సంభాషణలు గుచ్చుకుంటాయి. జీవితంలో నెగ్గాలంటే ఒక సామాన్యుడు ఇంత పోరాటం చేయాలా? అనిపిస్తుంది. సినిమా చూశాక... మనం కూడా పోరాటం చేయాలని అనిపిస్తుంది''


వెట్రిమారన్ తరహాలో చాలా సహజంగా తీశారు!
''శ్రీకాంత్ అడ్డాలను గారిని వెట్రిమారన్ గారితో ఎందుకు కంపేర్ చేశారంటే... 100 శాతం ఆయనలా సహజత్వంతో సినిమా తీశారు. నిజాయతీగా తెరకెక్కించారు. మేం కుత్రిమంగా సెట్స్ వేయలేదు. చరిత్రను కళ్ళ ముందు ప్రతిబింబించేలా... 1980 పరిస్థితులను చూపించేలా రియల్ లొకేషన్లలో సినిమా తీశాం. మరోసారి చెప్తున్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి శ్రీకాంత్ అడ్డాల మరో వెట్రిమారన్. ఈ కథను మేం అనుకున్నప్పుడు రెండు పార్టులుగా తీయాలని అనుకున్నాం. ఇదొక చరిత్ర... ఒక సామాన్యుడు ఎదుగుదల ఓ పూటలో జరగదు. ఆ పోరాటంలో చాలా సవాళ్ళు ఉంటాయి''


'పెద కాపు' టైటిల్ వెనుక... 
''తొలుత ఈ సినిమాకు 'పెదకాపు' టైటిల్ అనుకోలేదు. కర్ణ పాత్ర చేసే పోరాటం కనుక కర్ణ టైటిల్ అయితే ఎలా ఉంటుందని డిస్కషన్ వచ్చింది. ఆ సమయంలో శ్రీకాంత్ అడ్డాల గారు లొకేషన్స్ చూడటానికి వెళ్ళినపుడు 'పెద కాపు' పేరును ఓ బోర్డు మీద చూశారు. ఊరికి మంచి చేసిన వ్యక్తిని 'పెద కాపు' అంటారని అక్కడి వాళ్ళు చెప్పారట. మన కథ కూడా ఇదేనని 'పెద కాపు'టైటిల్ బావుంటుందని ఆయన అన్నారు. అప్పుడు టైటిల్ ఫిక్స్ చేశాం. కుటుంబం, సమూహం, ప్రాంతం... నా అనుకునే వారి కోసం కాపు కాచుకొని ఉండేవారికి 'పెద కాపు' టైటిల్ ఉంటుందనే ఉద్దేశంతో ఆ టైటిల్ పెట్టాం'' 


విరాట కర్ణను ప్రభాస్ (Prabhas)తో పోల్చారు!
''నటనతో ఎంతో మంది అగ్ర హీరోలకు శిక్షణ ఇచ్చిన సత్యానంద్ గారు మా విరాట్ కర్ణను ప్రభాస్ గారితో పోల్చడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి పాజిటివ్ గా ఉన్నాడు. స్క్రీన్ మీద కూడా బావున్నాడు. మేం మొదట విరాట్ కర్ణను హీరోగా అనుకోలేదు. తనకు సినిమాల మీద ఆసక్తి ఉంది. అయితే... ఈ కథకు ఓ సామాన్యుడు కావాలని అతడిని తీసుకోవడం జరిగింది. శిక్షణ తీసుకున్నాక... హీరోగా పరిచయం చేయవచ్చని నమ్మకం కుదిరిన తర్వాతే ముందుకు వెళ్లాం. ఒకవేళ హీరో సెట్ కాలేదంటే మరో హీరోతో వెళదామని ముందుగా చెప్పాను''


Also Read : విడాకుల ప్రశ్నకు 'కలర్స్' స్వాతి సమాధానం ఏమిటో తెలుసా? - వైరల్ స్టేట్మెంట్


శ్రీకాంత్ గారితో పాటు 294 మంది కొత్త నటులు... 
''శ్రీకాంత్ అడ్డాల గారు చేసిన పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. కూర్చున్న చోటే అన్నీ చేసే క్యారెక్టర్ అది. సహజంగా నటించే నటుడు మాత్రమే ఆ పాత్ర చేయగలరు. ఆ పాత్రకు ముందు ఇద్దరు నటులను అనుకున్నాం. కానీ, వారికి వీలుపడలేదు. ఓ రోజు తప్పని పరిస్థితుల్లో శ్రీకాంత్ గారు నటించారు. దర్శకుడికి అన్ని పాత్రలు తెలుసు కదా! ఈజీగా నటించారు. స్క్రీన్ మీద ఆయన్ను చూసినప్పుడు సర్‌ప్రైజ్ అవుతారు. అనసూయ, తనికెళ్ళ భరణి, రావు రమేష్ పాత్రలూ బలంగా ఉంటాయి. ఈ సినిమాతో 294 మంది కొత్తవారు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు'' 


'అఖండ 2'తో పాటు అడివి శేష్ సినిమా కూడా!
''పెద కాపు' తర్వాత 'పెద కాపు 2' కూడా విడుదల అవుతుంది. 'అఖండ 2' కూడా ఉంటుంది. అయితే... ఎప్పుడు? అనేది ఇప్పుడే చెప్పలేను. అడివి శేష్ గారితో ఓ సినిమా కూడా ఉంటుంది''   


Also Read : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial