Megastar Chiranjeevi About Cine Workers Issue: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫెడరేషన్, ఫిలిం చాంబర్ మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ యూనియన్ సభ్యులు షూటింగ్స్ బంద్ పాటిస్తున్నారు. ఈ క్రమంలో తనను సినీ కార్మికులు కలిశారంటూ వస్తోన్న వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

ఆ వార్తల్లో నిజం లేదు

తన మూవీ షూటింగ్ కార్మికులకు వేతనం పెంచి ఇస్తామని తాను హామీ ఇచ్చినట్లు వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని... తనను ఎవరూ కలవలేదని స్పష్టం చేశారు మెగాస్టార్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. 'ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకొంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30 శాతం వేతన పెంపు వంటి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేయడం నా దృష్టికి వచ్చింది.

ఈ సందర్భంలో ఓ విషయం స్పష్టం చేయదలచుకున్నా. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు. ఇది చిత్ర పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా అయినా, నేను సహా, ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు ఇండస్ట్రీలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయ  సమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్‌ సమిష్టి బాధ్యత. అంతవరకు, అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో చేసిన ఇలాంటి నిరాధారమైన, ప్రేరేపిత ప్రకటనలను నేను ఖండిస్తున్నా.' అంటూ క్లారిటీ ఇచ్చారు.

Also Read: అమాయకంగా కనిపిస్తాడు... కానీ తలలు కట్ చేసేస్తాడు - పోలీసులకు ఎలా దొరికాడో తెలుసా?... ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూసేయండి

కొలిక్కి రాని చర్చలు

మరోవైపు, ఫిలిం చాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో తెలుగు ఫిలిం చాంబర్ షూటింగ్స్ బంద్ చేయాలంటూ నిర్మాతలకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. మీటింగ్స్‌కు ఫిలిం చాంబర్ సభ్యులు దూరంగా ఉండాలని సూచించింది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఆదేశించింది. సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ యూనియన్స్ సభ్యులు షూటింగ్స్ బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి డిమాండ్స్‌ను ఫిలిం చాంబర్ ఖండించింది. దీనిపై చిరంజీవి, బాలకృష్ణలను కలిసినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఈ క్రమంలో ఫెడరేషన్, ఫిలిం చాంబర్ సభ్యుల మధ్య చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే ఈ వివాదం ముగిసే ఛాన్స్ ఉంది.