Megastar Chiranjeevi Fires On Collected Money For Fan Meet In London: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తాజాగా లండన్‌లోని యూకే పార్లమెంట్‌లో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (UK Lifetime Achievement Award) అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నించారు. మెగాస్టార్ ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఈ గోల్‌మాల్‌ వ్యవహారంపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఇలాంటివి అస్సలు ఒప్పుకోను'

దీనిపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటివి అస్సలు ఒప్పుకోనని స్పష్టం చేశారు. 'ప్రియమైన అభిమానులారా..! యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, అభిమానం నా హార్ట్‌ను తాకింది. ఈ క్రమంలో ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తనను నేను అస్సలు ఒప్పుకోను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే.. వెంటనే వారికి తిరిగిచ్చేయండి.

ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు, ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించను. మన మధ్య ఉన్న ప్రేమ, అభిమానం వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం.' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

Also Read: 'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?

అరుదైన గౌరవం..

లండన్‌లోని యూకే పార్లమెంటులో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్యం పురస్కారాన్ని అందుకున్నా‌రు మెగాస్టార్ చిరంజీవి. ఈ అరుదైన ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. 4 దశాబ్దాల నుంచి సినీ రంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలకు గానూ ఈ పురస్కారంతో గౌరవించారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవీన్ మిశ్రా ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈవెంట్‌లో ఆయనకు పురస్కారం అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' చేస్తున్నారు. ఆయన సరసన త్రిష హీరోయిన్‌గా చేస్తుండగా.. జూన్ లేదా జులైలో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత వెంటనే శ్రీకాంత్ ఓదెలతో ఓ మాస్ యాక్షన్ మూవీని చిరంజీవి చేయనున్నారు.