Meera Jasmine Re Entry In Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ నుండి వెళ్లిపోయిన సీనియర్ హీరోయిన్లు చాలా మంది ఒక్కొక్కరుగా కమ్ బ్యాక్‌ ఇస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో మీరా జాస్మిన్ కూడా ఒకరు. ప్రస్తుతం మీరా జాస్మిన్ కోలీవుడ్, మాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. గతేడాది విడుదలయిన ‘విమానం’ అనే తెలుగు సినిమాలో కూడా గెస్ట్ రోల్‌లో కనిపించి అలరించింది. కానీ త్వరలోనే మరో తెలుగు చిత్రంలో కీలక పాత్రలో కనిపించడానికి ఈ నటి సిద్దమయ్యింది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తానే స్వయంగా షేర్ చేసి ఫాలోవర్స్‌తో పంచుకుంది.


అదిరిపోయిన గ్లింప్స్..


శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘స్వాగ్’. ఇప్పటికే ఈ సినిమా నుండి హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రీతూ వర్మకు సంబంధించిన గ్లింప్స్‌లు విడుదలయ్యాయి. ఈ గ్లింప్స్‌తోనే సినిమాపై ఓ రేంజ్‌లో ఆసక్తి పెంచేశాడు హసిత్ గోలీ. ఇప్పుడు ‘స్వాగ్’లో ఉత్ఫల దేవిగా మీరా జాస్మిన్ నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ‘స్వాగ్’ నుండి ఉత్ఫల దేవిగా తన ఫస్ట్ లుక్‌ను తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది మీరా జాస్మిన్. అంతే కాకుండా చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది.


అచ్చ తెలుగు సినిమా..


‘స్వాగ్ ప్రపంచంలో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అచ్చ తెలుగు సినిమాతో తెలుగు సినిమాల్లోకి తిరిగిరావడం సంతోషంగా ఉంది. ఈ ఎంటర్‌టైనింగ్ ప్రయాణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఎదురుచూస్తూ ఉండండి’ అనే క్యాప్షన్‌తో తన ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది మీరా జాస్మిన్. ఈ ఫస్ట్ లుక్‌లో తను ఒక మహారాణిగా చాలా హుందాగా కనిపిస్తుందంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. పైగా చాలాకాలం తర్వాత తెలుగు చిత్రంలో కాస్త నిడివి ఎక్కువ ఉన్న పాత్రలో కనిపించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ‘స్వాగ్’కు సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను వెరైటీగా బయటపెడుతున్న మేకర్స్.. మీరా జాస్మిన్ పాత్ర రివీల్ కోసం కూడా అదే రూట్ ఫాలో అయ్యారు.






అందరికీ నచ్చిన నటి..


‘శ్రీ విష్ణుగాడి సినిమా అని తెలుసు. ఈ సినిమాలో మీ అందరికీ బాగా తెలిసిన, నచ్చిన, మీ ఇంట్లో మనిషిలాంటి నటి ఒకరున్నారు తెలుసా?’ అంటూ ‘స్వాగ్’ నుండి ఉత్ఫల దేవిగా మీరా జాస్మిన్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీలో శ్రీవిష్ణుకు జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. వింజామర వంశానికి చెందిన రుక్మిణీ దేవి పాత్రలో రీతూ కనిపించనుంది. ఇక యంగ్ డైరెక్టర్ హసిత్ గోలీ, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో ఇప్పటికే ‘రాజ రాజ చోర’ మూవీ తెరకెక్కి సూపర్ హిట్‌ను అందుకుంది. ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.


Also Read: కోలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్‌లో త్రిష - 'అమ్మోరు తల్లి'గా గ్లామర్ క్వీన్?