మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 20) థియేటర్లలోకి వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం రోరింగ్ దసరా విన్నర్ పేరుతో ఆదివారం హైదరాబాద్ లో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ సినిమాలో ఆర్టిస్ట్స్ కనిపించడం లేదు పాత్రలే కనిపిస్తాయని, దీనంతటికీ డైరెక్టర్ వంశీనే కారణమని అన్నారు. 'విక్రమార్కుడు' సినిమాలోని విక్రమ్‌ సింగ్ రాథోడ్‌ పాత్ర తర్వాత తనకు విపరీతమైన సంతృప్తినిచ్చిన పాత్ర ఇదేనని తెలిపారు. 


రవితేజ మాట్లాడుతూ.. ''టైగర్‌ నాగేశ్వరరావు సినిమాని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. విజువల్స్ అంత బాగా ఉండటానికి కెమెరామెన్ మధి కారణం. జీవీ ప్రకాష్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అద్భుతమైన సెట్స్ వేసిన అవినాష్ కొల్లాకి, లిరిక్ రైటర్స్ కు అభినందనలు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ యాక్షన్. ఓపెనింగ్ ట్రైన్ ఎపిసోడ్ పీటర్ హెయిన్స్ చేసాడు. మిగతా ఫైట్స్ అన్నీ రామ్ లక్ష్మణ్ చాలా చాలా బాగా చేసారు. ఈ మూవీ సక్సెస్ క్రెడిట్ వాళ్లకి కూడా వెళ్తుంది. డైలాగ్ రైటర్ శ్రీకాంత్ విస్సాతో ఈ ప్రయాణం ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు, శ్రేయోభిలాషుల నుంచి వస్తోన్న ప్రశంసలకు నా కృతజ్ఞతలు. ఈ సినిమాని అభిమానులే బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. ఫ్యూచర్ లో ఇంకా భారీ చిత్రాలు నిర్మించాలని, మరిన్ని సూపర్ డూపర్ హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 


''డైరెక్టర్ వంశీ ముందు తీసిన రెండు సినిమాలు ప్రాక్టీస్ మ్యాచ్ లు. ఇప్పుడు ఈ మ్యాచ్ ఇంత బాగా ఆడతాడని అనుకోలేదు. టైగర్ నాగేశ్వరరావు అనే మ్యాచ్ చాలా బాగా ఆడాడు. ప్రతీ ఆర్టిస్టుతో ఎలా కావాలంటే అలా నటింపజేశాడు. జిషు షేన్ గుప్తా, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, హరీష్ పేరడీ ఎవరి పాత్రలో వారు బాగా నటించారు. ఈ సినిమాలో ఆర్టిస్ట్స్ కనిపించడం లేదు, పాత్రలే కనిపిస్తాయి. దీనంతటికీ వంశీనే కారణం. ఇంత బాగా తెరకెక్కించగలడని అస్సలు ఊహించలేదు. వంశీ ఇంకా చాలా సినిమాలు చేయాలి. అతను కచ్చితంగా నెక్స్ట్ లెవల్ కు వెళ్తాడు. మంచి మంచి కథలు రాసుకో వంశీ.. నీకు ఆ కెపాసిటీ ఉంది. బిగ్ కంగ్రాట్స్. మనం ఇంకా ట్రావెల్ చెయ్యాలి.. కలిసి మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. క్లియర్ అండ్ కన్విన్షన్ ఉన్నోళ్లతో నేను ఎన్ని సినిమాలైనా చేస్తా. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. విక్రమ్‌ సింగ్ రాథోడ్‌ పాత్ర తర్వాత నాకు విపరీతమైన సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఈ టైగర్ నాగేశ్వరరావు’’ అని రవితేజ తెలిపారు.






కాగా, స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రవితేజ సరసన నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రన్ టైంపై మిశ్రమ స్పందన రావడంతో, 3.02 గంటల నిడివితో రిలీజైన ఈ సినిమాని 2.37 గంటలకు తగ్గించారు. దసరా వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. 


Also Read: 'ఆయన అఛీవర్‌, నేను అఛీవ్‌మెంట్‌ మాత్రమే'.. బన్నీ ఎమోషనల్‌ స్పీచ్‌!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial