Unni Mukundan's Marco OTT Release On Aha And Already Streaming On SonyLIV: మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా దర్శకుడు హనీఫ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' (Marco). గతేడాది డిసెంబరు 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఈ క్రమంలో మూవీ టీం డిసెంబర్ 31న తెలుగులో రిలీజ్ చేయగా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే, ఇప్పటికే 'మార్కో' సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా మరో తెలుగు ఓటీటీలో 'ఆహా'లోనూ (Aha) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తెస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా 'ఆహా' అధికారికంగా ప్రకటించింది.

ఈ నెల 21 నుంచి దీన్ని చూడొచ్చని తెలిపింది. విదేశాల్లో ఉన్న వారు ఈ నెల 18 నుంచే 'మార్కో'ను చూసి ఆనందించాలని పేర్కొంది. అయితే, ఇటీవలే 'సోనీలివ్'లో మార్కో తెలుగు, మలయాళంతో పాటు మరో 3 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'మార్కో' దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా గతేడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా తొలి ఏ రేటెడ్ మలయాళం మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?

వయలెన్స్‌తో భయపెట్టేశాడుగా..

ఉన్ని ముకుందన్ 'మార్కో' సినిమాతో వయెలెన్స్ అంటే ఎలా ఉంటుందో మాలీవుడ్‌కు పరిచయం చేశారు. ప్రతి యాక్షన్ సీన్‌లోనూ ఆడియన్స్‌ను భయపెట్టారు. ఓ కుటుంబం పెంచుకున్న వారసుడు మార్కో (ఉన్ని ముకుందన్). వారసత్వ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. తన సొంత తమ్ముడు విక్టర్ (ఇషాన్ షౌకత్)తో కలిసి సమానంగా మార్కోను చూస్తాడు ఆ ఇంటి పెద్దకొడుకు జార్జ్ (సిద్ధిఖ్). అంధుడైన విక్టర్‌కు మార్కో అంటే ప్రాణం. అలాంటి అతనిపై దుండగులు యాసిడ్ దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోతాడు. ఈ హత్య వెనుక ఎవరున్నారు.? ఆ మిస్టరీ వెనుక అసలు కారణం ఏంటనేది.? మార్కో వారిని ఎలా పట్టుకున్నాడు.? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

టాలీవుడ్‌లోనూ సినిమాలు..

టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఉన్ని ముకుందన్. ఆ తర్వాత అనుష్క భాగమతి, ఖిలాడీ, సమంత యశోద మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు, హీరోగానే కాకుండా మలయాళంలో ప్రొడ్యూసర్‌గా సింగర్‌గానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం మార్కోతో భయపెట్టిన ఉన్ని ముకుందన్.. తన తర్వాతి చిత్రం 'గెట్ సెట్ బేబీ'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వినయ్ గోవింద్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో నిఖిలా విమలా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ కామెడీ బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ కథగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Also Read: సాయిపల్లవికి ముద్దు పెట్టిన లేడీ ఫ్యాన్ - రజినీ 'భాషా' స్టైల్‌లో ఎలివేషన్స్ మామూలుగా లేదుగా..