Manjummel Boys Creates History in Tamil Nadu: ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజవుతున్న సినిమాలే బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాలు నమోదు చేస్తున్నాయి. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొన్నటికి మొన్న టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా, చిన్నసినిమాగా రిలీజైన 'హనుమాన్‌' దూసుకుపోయింది. రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. అలాంటిదే ఇప్పుడు ఈ మలయాళీ సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. అంతేకాకుండా తమిళనాడులో అత్యధిక వసూళ్లు రాబట్టిన కేరళ సినిమాగా రికార్డులు సృష్టించింది. 


రికార్డులు మోత.. 


మలయాళ సినీ ఇండస్ట్రీ ఫుల్ జోష్‍లో ఉంది. ఫిబ్రవరి నెల మలయాళ సినీ పరిశ్రమకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ నెలలో హ్యాట్రిక్ బ్లాక్‍బాస్టర్లు కొట్టింది. తక్కువ బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫిబ్రవరి 22న రిలీజైన'మంజుమ్మెల్ బాయ్స్' అనుకోని విజయం సాధించింది. ఆ విజయం కేరళ వరకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్‌ ఆ సినిమాని ఆదరిస్తున్నారు. దీంతో కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళీ సినిమాగా రికార్డులు సృష్టించింది. రిలీజైన వారంలోనే తమిళనాడులో దాదాపు రూ.2 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. రూ.3 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీకెండ్‌ కాకపోయినా కూడా.. మంగళవారం ఒక్కరోజే దాదాపు రూ.70లక్షలు వసూలు చేసింది. ఇక వీకెండ్‌లో రోజుకి రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు కలెక్ట్‌ చేస్తుందని సినీవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోతుందని అంచనా వేస్తున్నారు. 


దూసుకుపోతున్న మూడు సినిమాలు..


ఫిబ్రవరి నెలలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన మూడు మళయాల చిత్రాలు రిలీజయ్యాయి. డిఫరెంట్ జానర్లలో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్‍గా కొనసాగుతున్నాయి. 'ప్రేమలు', 'భ్రమయుగం' సినిమాలు రిలీజ్‌ కాగా.. వాటితో పోటీ పడుతోంది 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' సినిమా. ఈ సినిమాకి చిదంబర్‌ పి పొందువేల్‌ దర్శకత్వం వహించారు. సౌబిన్ షశీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్, దీపక్ ప్రమబోల్ ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు రూ.5 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే, ఈ సినిమా ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంటున్నారు సినీవిశ్లేషకులు. 


ఇక ‘భ్రమయుగం’ సినిమా విషయానికొస్తే.. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించిన సినిమా ఇది. ఈ సినిమా కూడా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా సైకలాజికల్‌ హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఫిబ్రవరి 15న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ వసూళ్లు కొనసాగిస్తూనే ఉంది. ఈ సినిమాకి రాహుల్ సదాశివం దర్శకత్వం వహించారు. ఈ సినిమాని డిఫరెంట్‌గా తెరకెక్కించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ థీమ్‌తో ఈ సినిమాని తీశారు. 


'ప్రేమలు' విషయానికొస్తే.. నెల్సన్‌ కే గఫూర్‌, మమితా బజు ప్రధాన ప్రాత్రలు పోషించారు. ఈ సినిమాని గిరీశ్‌ ఏడీ తెరకెక్కించారు. ఫీల్‌గుడ్‌, రొమాంటిక్‌ కామెడీ చిత్రం ఇది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈసినిమా ఇప్పటి వరకు రూ.60 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇక ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. మార్చి 8న రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read: హాలీవుడ్‌లో రీమేక్ కానున్న వెంకటేష్ మూవీ - కొరియా, ఇండోనేషియాలోనూ!