'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్'(Ismart Shankar) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో 'ఇస్మార్ట్ శంకర్' ముందు వరుసలో ఉంటుంది. ఇక ఈ సినిమా పాటలు అప్పట్లో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మణిశర్మ కంపోజ్ చేసిన మాస్ ఆల్బమ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. రిలీజ్ కి ముందు సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వడానికి సాంగ్స్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. 'ఇస్మార్ట్ శంకర్' ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలవడంతో పాటు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Continues below advertisement

ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సీక్వెల్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయమై రకరకాల వార్తల వినిపించాయి. ఎట్టకేలకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సస్పెన్స్ వీడినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే ఆల్బమ్ అందించిన మణిశర్మ నే మరోసారి 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా మూవీ టీం ఫైనల్ చేసిన తెలుస్తోంది. ఇప్పటికే ఓ పాటకి సంబంధించిన ట్యూన్ తో పాటు ఫైనల్ కంపోజిషన్ కూడా ఓకే అయిపోయిందని అంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడు మణిశర్మ పేరు లేదు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాథ్ తో ఏమో విభేదాలు ఉన్నాయని, పైగా పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు చిత్ర బృందం మొగ్గు చూపుతుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం అవన్నీ అవాస్తవాలని తెలిసింది. నిజానికి ఈ సినిమా కోసం ముందు తమన్, అనిరుద్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో మాట్లాడారట. కానీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ లోపు పనులు జరగాలంటే వాళ్లతో కుదరదని చివరగా మణిశర్మకే ఓటేశారని అంటున్నారు. పైగా మొదటి భాగంలోని పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో కొంత సీక్వెల్లో కూడా వాడడం ఆనవాయితీగా వస్తుంది.

కాబట్టి వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో అంటే కష్టం. ఒకవేళ అది జరిగితే కాపీ రైట్ సమస్య కూడా వస్తుంది. ఇవన్నీ ఆలోచించే పూరి అండ్ టీం మణిశర్మనే ఫైనల్ చేసినట్లు సమాచారం. త్వరలోనే మూవీ టీం మ్యూజిక్ డైరెక్టర్ విషయమై అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మణిశర్మ ఈ మధ్యకాలంలో తన స్థాయికి తగ్గట్లు సంగీతం ఇవ్వలేకపోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన 'శాకుంతలం', 'ఆచార్య' లాంటి సినిమాలను గమనిస్తే అర్థమవుతుంది.

మరి పూరి జగన్నాథ్ మణిశర్మతో ఎలాంటి అవుట్ పుట్ బయటికి తెస్తాడో చూడాలి.  రిలీజ్ కి చాలా టైం ఉంది కాబట్టి మణిశర్మ నుంచి 'ఇస్మార్ట్ శంకర్' తరహాలో మరో మాస్ ఆల్బమ్ ఆశించవచ్చు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నాడు. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 మార్చ్ 8 మహాశివరాత్రి కానుకగా విడుదల కాబోతోంది.

Also Read : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola