Mani Sharma reacts on KCR dialogue used in Double Ismart Song: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్'కు ఇది సీక్వెల్. 2019లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిన తెలిసిందే. రామ్ ఎనర్జీ, మాస్ యాక్షన్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లను తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడించి యూత్‌ను బాగా ఆకట్టుకున్నాడు పూరీ.
బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. కానీ, మూవీ రిలీజైన ఐదేళ్లకు ఈ సినిమా పట్టాలెక్కింది. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మూవీని ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఒక్కొ అప్‌డేట్ వదులుతోంది మూవీ టీం. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ నుంచి "మార్ ముంత.. చోడ్ చింత" అనే సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వాయిస్‌ను ఉపయోగించడంతో ఈ పాట నెట్టింట సెన్సేషన్‌గా మారింది.
"ఏం జేద్దామంటవు మరి?" అనే డైలాగ్‌ను ఉన్నది ఉన్నట్టు వాడారు. కేసీఆర్ డైలాగ్ వాడటంతో ఈ పాట సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు, ఫాలోవర్స్ నుంచి మాత్రం మూవీ టీంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తమ నాయకుడి వాయిస్ ఉపయోగించి ఆయనను కించపరించారంటూ మూవీ టీం, సాంగ్ కంపోజర్ మణిశర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సాంగ్ వస్తున్న నెగిటివిటీ స్వయంగా మణిశర్మ స్పందించారు. నిజానికి ఇది హీరోహీరోయిన్ల మధ్య సాగే పాట అయినా. ఇదంతా కల్లు కంపౌండ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఇలాంటి మందు పాటలో కేసీఆర్ డైలాగ్ ఎలా వాడతారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. దీనిపై మణిశర్మ తాజాగా ఓ ఇంటర్య్వూలో వివరణ ఇచ్చారు.
కేసీఆర్ గొప్ప వ్యక్తి. ఎలాంటి సీరియస్ మ్యాటర్‌ని ఆయన తనదైన మాటలతో చమత్కారిస్తుంటారు. అందుకే ఆయన మనందరి ఫేవరేట్ అయ్యారు. ముఖ్యంగా ఆయన డైలాగ్స్ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆయన్ను చాలా మీమ్స్‌లో చూస్తుంటాం. ఆయన అంటే అందరికి గౌరవమే. తన మాటలతో ఆయన అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అయితే ఈ పాటను మేము మీమ్స్ నుంచి తీసుకున్నాం. అందుకే మీమ్స్‌లో ఆయన డైలాగ్‌లో బాగా ఫేమస్ అయినా "ఏం జేద్దామంటవు మరి?" వాయిస్‌ని వాడాం. ఎంజాయ్... పండగ అనేది కూడా మీమ్స్ నుంచి తీసుకుందే. ఇది కేవలం మూవీ వినోదం కోసమే వాడాం తప్పా.. ఆయనను కించపరచాలని కాదు. దయచేసి దీన్ని తప్పుగా తీసుకోకండి. అయినా ఇదేం ఐటెం సాంగ్ కాదు. హీరోహీరోయిన్లు కలిసి చేసే డ్యూయెట్ సాంగ్" అంటూ మణిశర్మ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.