Kannappa: 'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు

Kannappa Postponed: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' రిలీజ్ వాయిదా పడింది. ఏప్రిల్ 25న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కానందున ఆలస్యం కానుంది.

Continues below advertisement

Manchu Vishnu's Kannappa Movie Postponed: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa) మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీఎఫ్ఎక్స్ పనులకు మరింత సమయం పట్టాల్సి రావడంతో సినిమా వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో సినీ ప్రియులు, అభిమానులకు ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే, ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సి ఉంది.

Continues below advertisement

కొత్త విడుదల తేదీ ఎప్పుడో?

త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని మంచు విష్ణు (Manchu Vishnu) 'ఎక్స్' వేదికగా తెలిపారు. 'కన్నప్ప జీవిత ప్రయాణం అద్భుతం. అత్యున్నత ప్రమాణాలు కలిగిన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో దాన్ని అందించేందుకు మేము కృత నిశ్చయంతో ఉన్నాం. ఇందుకు మరికొన్ని వారాల సమయం అవసరం. కీలక ఎపిసోడ్స్‌కు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో సినిమా విడుదల కాస్త ఆలస్యం అవుతుంది. ఈ సినిమా కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోగలం.

మూవీ రిలీజ్ ఆలస్యం అవుతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. మీ సహనం, సహకారానికి ధన్యవాదాలు. మహాశివునికి కన్నప్ప ఎంత గొప్ప భక్తుడో అందరికీ తెలుసు. అలాంటి భక్తుని కథను అద్భుతంగా మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. మా టీం పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కొత్త విడుదల తేదీతో త్వరలోనే మీ ముందుకు వస్తాం.' అని మంచు విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: మోహన్‌లాల్ 'లూసిఫర్ 2: ఎంపురాన్' వివాదం - మూవీలో ఆ సీన్స్ కట్

పాన్ ఇండియా సినిమాగా..

'కన్నప్ప' సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై డా. మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. తెలుగుతో పాటు తమిళ,‌ కన్నడ, మలయాళ, హిందీ,‌ ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. మూవీలో పరమశివుని పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వీరితో పాటు మోహన్ లాల్, ముఖేష్ ఋషి, శరత్ కుమార్ తదితరులు కనిపించనున్నారు. విష్ణు జోడిగా ప్రతి ముకుందన్ నటించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, లుక్స్, సాంగ్స్ సినిమాపై హైప్ భారీగా పెంచేశాయి. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మూవీలో కన్నప్పగా మంచు విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, పార్వతీదేవిగా కాజల్ కనిపించనున్నారు. మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరించడం సహా మహాదేవశాస్త్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతోనే విష్ణు తనయుడు ఆవ్రామ్ తెరంగేట్రం చేయనున్నాడు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌పై

ఈ సినిమా సాంగ్స్, లుక్స్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌పై నటుడు మంచు విష్ణు ఇటీవల ఓ కార్యక్రమంలో స్పందించారు. ప్రజలకు అన్నీ తెలుసని.. అలాంటి ట్రోలింగ్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను చేసిన కామెంట్స్‌లో ఏదో ఒక వాక్యం తీసుకుని కట్ చేసి దాన్ని పనిగట్టుకుని వైరల్ చేసి వివాదం సృష్టించాలనుకుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు.. నటుడు రఘుబాబు సైతం 'కన్నప్ప' సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేస్తే వారు శివుని ఆగ్రహానికి గురవుతారంటూ కామెంట్స్ చేయడం వైరల్‌గా మారాయి.

Continues below advertisement