బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
బాంద్రాలోని ఇంటి మీద నుంచి దూకి
మలైకా అరోరా తండ్రి, వారి కుటుంబం ముంబై నగరంలోని బాంద్రా ఏరియాలో ఉంటున్నారు. ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 11, బుధవారం) ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో టెర్రస్ మీదకు వెళ్లి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు అనిల్ అరోరా. ఆయన దూకిన విషయం తెలిసి ఆ అపార్ట్‌మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ వచ్చే సరికి ప్రాణాలు పోయినట్టు తెలుస్తోంది. సూసైడ్ లెటర్ ఏదీ కనిపించలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది.
అనిల్ అరోరా ఆత్మహత్య విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ అరోరా స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా. దేశ సరిహద్దుల్లో ఉంటుంది ఆ ఊరు. ఆయన ఇండియా మర్చంట్ నేవీలో ఉద్యోగిగా పని చేశారు. మలైకాతో పాటు ఆయనకు మరొక కుమార్తె ఉంది. ఆమె పేరు అమృత.
పుణె వెళ్లిన మలైకా అరోరా...
విషయం తెలిసి హుటాహుటిన ముంబైకు
తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో మలైకా అరోరా ఇంటి దగ్గర లేరు. వృత్తిపరమైన పనుల మీద ఆవిడ పుణె వెళ్లారు. విషయం తెలిసి హుటాహుటిన ముంబైకి ప్రయాణం అయినట్టు తెలిసింది. అనిల్ అరోరా ఇంటి దగ్గర మలైకా అరోరా మాజీ భర్త, నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ మీడియాకు కనిపించారు.
మలైకా అరోరా తల్లి జాయిస్ మలయాళీ క్రిస్టియన్. ఆమెకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తల్లి, చెల్లెలితో పాటు కలిసి పెరిగారు ఆమె. అయితే... తండ్రితో సత్సంబంధాలు ఉన్నాయి. తెలుగులో పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలోని 'కెవ్వు కేక'తో పాటు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు మలైకా అరోరా. హిందీలో షారుఖ్ ఖాన్ సరసన 'దిల్ సే' సినిమాలో స్టెప్పులు వేసిన 'చయ్యా చయ్యా' సాంగ్ ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలిసిందే.
Also Read: జాన్వీ కపూర్ కట్టిన చీర రేటు ఎంతో తెలుసా? ఇయర్ రింగ్స్ 13 లక్షలు ఏంటి బాసూ!