'గుంటూరు కారం' తనకు లాస్ట్ రీజనల్ ఫిల్మ్ అని ఆ సినిమా విడుదలకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చాలా స్పష్టంగా చెప్పారు. ఇకపై తాను చేసే సినిమాలు పాన్ ఇండియా లెవల్ అని వివరించారు. తన తొలి పాన్ ఇండియా సినిమాను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అందులో సూపర్ స్టార్ కంప్లీట్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ లుక్ ప్రిపరేషన్ కోసం ఆయన మూడు నెలలు ఎవరికీ కనిపించకూడదని డిసైడ్ అయ్యారట.
మార్చి నుంచి రాజమౌళి సినిమా లుక్ కోసం!
'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబును గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్తగా చూపించారు. కొంచెం పెరిగిన గడ్డం, లుంగీలో మాసీగా ఉన్నారు. ఇప్పుడు ఆ లుక్ కంటే పూర్తి భిన్నమైన లుక్ కోసం మహేష్ బాబు, రాజమౌళి ట్రై చేస్తున్నారట. గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కనుక అందుకు తగ్గట్టుగా లుక్ ఉంటుందట.
మహేష్ బాబు త్వరలో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేయనున్నారు. ఆ తర్వాత మార్చి నుంచి పూర్తిగా పబ్లిక్ మీటింగ్స్, పబ్లిక్ అప్పియరెన్స్ వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలని సూపర్ స్టార్ డిసైడ్ అయ్యారట. రాజమౌళి సినిమా కోసం ప్రజెంట్ అనుకుంటున్న లుక్ కోసం మినిమమ్ రెండు నుంచి మూడు నెలలు పడుతుందట. అన్ని రోజులు పబ్లిక్ లో మహేష్ బాబును చూడకుండా అభిమానులు ఉండక తప్పదు. వాళ్లు ఆ త్యాగం చేయాలి.
జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్!?
రాజమౌళి సినిమాలకు ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథలు రాస్తారు. ఇప్పుడీ మహేష్ బాబు సినిమాకు కూడా ఆయన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా విడుదలైన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఈ సినిమా స్టోరీ ఐడియాస్, స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందట. జూన్ 2024 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మహారాజా చక్రవర్తి... సినిమా టైటిల్ ఏది?
మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు టైటిల్ కూడా ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు, అభిమానుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 'మహారాజా', 'చక్రవర్తి' పేర్లు పరిశీలనలో ఉన్నాయట. మహేష్ బాబు పేరులో మహా, రాజమౌళి పేరులో రాజా తీసుకుని 'మహారాజా' టైటిల్ ఖరారు చేసినట్లు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి, చివరకు ఏ టైటిల్ ఉంటుందో చూడాలి.
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో కథానాయికగా ఇండోనేషియా నటి చెల్సా ఎలిజబెత్ నటించనున్నారు. ఈ సినిమాను ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో కెఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.