సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ కు సంబంధించి చిత్ర యూనిట్ కి వరుస సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా ప్రారంభంలో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల మరికొన్ని షెడ్యూల్స్ ని ఇటీవల  రద్దు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ మూవీ షూటింగ్ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.


'గుంటూరు కారం' మూవీ షూటింగ్ కు సంబంధించి కొత్త షెడ్యూల్ జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉండగా.. సినిమాలో నటిస్తున్న కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ సమస్యల కారణంగా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. నిజానికి ఈనెల 7వ తేదీనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ జూన్ 12న వాయిదా వేశారు. ఇప్పుడు అది కాస్త జూలై నెలకి వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 12న మొదలవ్వాల్సిన లేటెస్ట్ షెడ్యూల్ ని ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో జూన్ 20 కి మార్చారు.


కానీ ఇప్పుడు లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం షూటింగ్ జూలై నెలకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇలా సినిమా షూటింగ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో చిత్ర యూనిట్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇలా షూటింగ్ వాయిదా పడితే సినిమా అనుకున్న సమయానికి విడుదల అవ్వడం కష్టమే అని చెబుతున్నారు. కాగా ఇప్పటికే మూవీ యూనిట్ ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేసిన టీజర్ గ్లిమ్స్ భారీ రెస్పాన్స్ ని అందుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను తారస్థాయికి చేర్చింది. ఇప్పటివరకు యూట్యూబ్ లో ఈ టీజర్ గ్లిమ్స్ కి ఏకంగా 30 మిలియన్ల వ్యూస్ దక్కడం విశేషం.


త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి మహేష్ బాబు లో ఉన్న మాస్ ని కంప్లీట్ గా బయటికి తీసే ప్రయత్నం చేసినట్లు టీజర్ గ్లిమ్స్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా శ్రీలీల బర్త్ డే సందర్భంగా మూవీ టీం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్, ఎస్ తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి పీఎస్ వినోద్, ఏఎస్ ప్రకాష్, నవీన్ నులి, రామ్ లక్ష్మణ్ వంటి అగ్ర సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల అనంతరం సుమారు 12 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం' పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాలను ఈ సినిమా ఏ మేర అందుకుంటుందో చూడాలి.


Also Read: 'ఆదిపురుష్'పై నెగటివ్ రివ్యూ - యువకుడిని చితకబాదిన అభిమానులు