Movie Artist Association Suspended Actress Hema: సినీ నటి హేమ రేవ్‌ పార్టీ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. గత మే 20న బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో ఆమె డ్రగ్స్‌ తీసుకున్నట్టు వెల్లడవ్వడంతో ఇటీవల పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. హేమపై నేరారోపణలు రుజువు కావడంతో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆమె వేటు వేసింది. తాజాగా హేమను మా నుంచి సస్పెండ్‌ చేస్తూ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హేమను మా నుంచి సస్పెండ్‌ చేయడమే కాదు ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు.


కాగా హేమ 'మా' సభ్యత్వంపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. హేమ అరెస్ట్‌తో ఆమె సభ్యత్వం రద్దుపై మంచు విష్ణు సభ్యుల వివరాలు తీసుకున్నారట. ఈ మేరకు మా అసోసియేషన్‌లో గ్రూప్‌లో ఆయన బుధవారం సందేశాలు పంపించారట. దీంతో సభ్యుల్లో చాలా మంది ఆమెను సస్పెండ్‌ చేయాల్సిందే అంటూ సమాధానాలు ఇవ్వడంతో ప్యానెల్‌ సభ్యుల అభిప్రాయం మేరకు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సస్పెన్షన్‌ హేమకు క్లీన్‌ చిట్‌ వచ్చేవరకు కొనసాగుతుందని ప్రెసిడెంట్‌ స్పష్టం చేశారు. 


'మా'లో హేమ బాధ్యతలు


కాగా గత 'మా' ఎన్నికల్లో హేమ ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్‌ నుంచి పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. అంతకు ముందు హేమ మాలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నటుడు శివాజీ రాజా, నరేష్‌ అధ్యక్షతన‌ హేమ మా అసోసియేషన్‌లో రెండు సార్లు కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇక గత ఎన్నికల కంటే ముందు ఉపాధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా  బరిలోకి దిగి 225 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇలా మా అసోసియేషన్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న హేమ గత ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ తరపున పోటీకి దిగి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలాగే హేమ రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆమె ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె తర్వాత రెండేళ్లకే మళ్లీ ఏప్రిల్ 13, 2021లో భారతీయ జనతా పార్టీలో చేరింది.


రేవ్‌ పార్టీ కేసు


హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వాసు తన పుట్టినరోజు సందర్భంగా బెంగళూరులో పార్టీ నిర్వహించాడు. అక్కడి ఎలక్ట్రానిక్‌ సీటీలోని జీఆర్‌ ఫాంహౌజ్‌లో గత మే 19న రాత్రి సన్‌సెట్‌ టూ సన్‌రైజ్‌ విక్టరీ పేరుతో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో నటి హేమతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గన్నారట. అర్థరాత్రి డీజే సౌండ్స్‌ ఎక్కువ రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ పార్టీపై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో దీనిని రేవ్‌ పార్టీగా గుర్తించి పార్టీకి హాజరైన వారిలో దాదాపు 120 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో హేమ కూడా ఉన్నట్టు బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. అదుపులోకి తీసుకున్న వారికి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా అందులో 86 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో పోలీసులు వారందరికి నోటీసులు ఇచ్చి అరెస్ట్‌ చేశారు. పాజిటివ్‌గా తేలిన వారిలో హేమ కూడా ఉండటంతో ఈ కేసులో ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నారు.