తెలుగులో థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందులోనూ ఎప్పుడూ హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలదే రాజ్యం. ప్రేక్షకులకు థ్రిల్ అందించడమే లక్ష్యంగా, కొత్త కథ & కథనాలతో తీసే సినిమాలు అరుదుగా వచ్చాయి. వాటిలో 'మా ఊరి పొలిమేర' (Maa Oori Polimera Movie) ఒకటి. ఆ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల అయ్యింది.


'మా ఊరి పొలిమేర' సినిమాలో 'స‌త్యం' రాజేష్‌ హీరోగా నటించారు. ఆయనకు జోడీగా తెలుగు అమ్మాయి, నటి డా. కామాక్షి భాస్కర్ల కథానాయిక పాత్ర చేశారు. ఇందులో 'గెట‌ప్' శ్రీను, హీరో బాలాదిత్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా ఎండింగులో సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఆ సినిమా అప్డేట్ ఏంటంటే.... 


దేవభూమిలోనూ చిత్రీకరణ
'మా ఊరి పొలిమేర' చిత్రీకరణ అంతా దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. కానీ, సీక్వెల్ షూటింగ్ కోసం దేవభూమి ఉత్తరాఖండ్ వెళ్ళారు. అక్కడితో సహా గాడ్స్ ఓన్ కంట్రీ కేర‌ళ‌, మన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణలోని ఖ‌మ్మం, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి అయ్యింది. 


శరవేగంగా పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు
'మా ఊరి పొలిమేర 2' చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ పార్టుకు కూడా ఆయనే దర్శకుడు. ఇప్పుడీ సీక్వెల్ (Maa Oori Polimera 2)ను  శ్రీ కృష్ణ క్రియేష‌న్స్ పతాకంపై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. 


'మా ఊరి పొలిమేర' కథేంటి?
సీక్వెల్ ఎలా ఉండబోతుంది?
'మా ఊరి పొలిమేర' సినిమాలో 'సత్యం' రాజేష్ ఆటోడ్రైవర్ రోల్ చేశారు. అతని మీద అనుమానంతో కొందరు చంపేస్తారు. అన్నయ్య మరణానికి కారణమైన వ్యక్తులకు శిక్ష పడాలని తమ్ముడు, పోలీస్ కానిస్టేబుల్ అయిన బాలాదిత్య కోర్టులో కేసు వేస్తాడు. నిందితులకు శిక్ష పడటం ఖరారైన సమయంలో కేసు విత్ డ్రా చేసుకుంటాడు. ఎందుకు? అంటే... 'సత్యం' రాజేష్ చేతబడులు, మంత్ర విద్యలు ద్వారా కొందరి మరణాలకు కారణం అయ్యాడని నిజం తెలుస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే... 'సత్యం' రాజేష్ చావలేదనేది. కట్టుకున్న భార్యను వదిలేసి, ప్రేమించిన అమ్మాయితో లేచిపోయి మరొక ఊరు వెళ్ళి సెటిల్ అయినట్లు చూపిస్తారు. కథలో ట్విస్టులు ప్రేక్షకులకు మామూలు షాకులు ఇవ్వలేదు. 


Also Read 'శ్రీదేవి శోభన్ బాబు' రివ్యూ : చిరంజీవి కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే? 


ఆల్రెడీ సత్యం రాజేష్ (Satyam Rajesh)కు చేతబడులు, మంత్ర విద్యలు వచ్చు అనేది ఫస్ట్ పార్టులో రివీల్ చేశారు. ఇప్పుడు సెకండ్ పార్టులో ఆయన ఏం చేస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. 'స‌త్యం' రాజేష్‌, డా. కామాక్షీ భాస్కర్ల, 'గెట‌ప్' శ్రీను, బాలాదిత్యతో పాటు ర‌వి వ‌ర్మ‌, 'చిత్రం' శ్రీను, అక్షత శ్రీనివాస్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గ్యాని సంగీతం, ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు. ఉపేంద్ర రెడ్డి చందా కళా దర్శకత్వం వహించారు.


Also Read 'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా?