కోలీవుడ్ స్టార్ హీరో కం డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఈ దీపావళికి 'జిగర్తాండ డబుల్ ఎక్స్' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా లారెన్స్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తమిళం తో పాటు తెలుగులో కూడా తనకు మంచి మార్కెట్ ఉండడంతో ఇక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు అగ్ర సీనియర్ హీరోలతో సినిమాలలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అందుకు కథలు కూడా రెడీగా ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎవరా సీనియర్ హీరోలు? డీటెయిల్స్ లోకి వెళ్తే..


కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాఘవ లారెన్స్ ఆ తర్వాత కాలంలో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు. అక్కడితో ఆగకుండా దర్శకుడిగాను తన సత్తా ఏంటో చూపించాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని(కాంచన) సిరీస్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో మాత్రం హీరోగా సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు లారెన్స్. రీసెంట్ గా 'చంద్రముఖి 2' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఈ కోలీవుడ్ హీరో త్వరలోనే 'జిగర్ తండా డబుల్ ఎక్స్' అనే సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరో తమిళ అగ్రనటుడు SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.


ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న లారెన్స్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ప్రస్తుతం నటుడిగా నేను బిజీగా ఉన్నాను. భవిష్యత్తులో తప్పకుండా మళ్లీ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. నేను దర్శకత్వం వహించేందుకు సిద్ధమైన సమయంలో చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్ లతో సినిమాలు చేస్తాను. వారికి తగ్గ కథలను కూడా రెడీ చేసి పెట్టాను" అని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే నాగార్జునతో 'మాస్', 'డాన్' వంటి సినిమాలు చేసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే తను మళ్ళీ మెగా ఫోన్ పడితే కచ్చితంగా చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తానంటూ లారెన్స్ చెప్పడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


ఈ సీనియర్ మోస్ట్ హీరోలతో లారెన్స్ సినిమాలు ఎప్పుడు ఉంటాయనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రజెంట్ లారెన్స్ హీరోగా బిజీ అవ్వడం వల్ల డైరెక్షన్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం వహించాల్సి వస్తే 'కాంచన' మూవీకి సీక్వెల్ తీస్తానని తెలిపారు లారెన్స్. అంతేకాకుండా 'చంద్రముఖి 2' ఫెయిల్యూర్ పై రియాక్ట్ అవుతూ.. కథ చెప్పినప్పుడు బాగుందని, కానీ తెరపైకి వచ్చాక మరోలా మారిందని అన్నారు. ఓ దర్శకుడిగా ఏ సినిమా ఎలా వచ్చిందో షూటింగ్ టైంలోనే తెలుస్తుందని, అందుకే సైలెంట్ గా ఉంటామని అన్నారు. 'చంద్రముఖి 2' విషయంలో తాను హ్యాపీ అని, తనకి రావలసిన డబ్బులు వచ్చాయని, తనతో పాటు నిర్మాతలకు కూడా డబ్బులు వచ్చాయని అన్నాడు.


Also Read : ఓటీటీలోకి దిల్‌రాజు, అసలు విషయం చెప్పేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial