టాలీవుడ్ లో నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి త్వరలోనే 'అగ్ని నక్షత్రం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మంచు లక్ష్మి ఓ పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. అంతేకాదు సినిమాలో ఆమె తండ్రి, సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ ని విడుదల చేయగా.. ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు లక్ష్మి విలేకరులతో ముచ్చటించింది. ఈ సమావేశంలో సినిమా గురించి మాట్లాడిన ఆమె బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి పై ప్రశంసల వర్షం కురిపించింది.


మంచు లక్ష్మి మాట్లాడుతూ " పోలీస్ నేపథ్యంలో సాగే సినిమాలను బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తారు. పోలీస్ పాత్రను ప్రధానంగా తీసుకొని ఓ సోషల్ మెసేజ్ ని చెబుతూ సినిమాని ఆయన గ్రాండియర్ గా తెరకెక్కించే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న 'అగ్ని నక్షత్రం' సినిమా కథలోని సారాంశం కూడా ఆయన సినిమాల్లో లాగే ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే అగ్ని నక్షత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రకు న్యాయం చేయడం కోసం ఎంతగానో శ్రమించాను. రోహిత్ శెట్టి ఫిలిం మేకింగ్ స్టైల్ ని అనుసరిస్తూనే అగ్ని నక్షత్రంలో 'తెలుసా  తెలుసా' అనే ప్రమోషనల్ సాంగ్ ని రెడీ చేశాం. ఈ పాటలో దాదాపు రూ.80 కోట్ల విలువైన కార్లను ఉపయోగించాం. సినిమాలో ఈ పాట ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కు అద్దం పట్టేలా ఉంటుంది" అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా హైదరాబాదులో ఉన్న కొంతమంది. పోలీస్ ఆఫీసర్స్ అలాగే షీ టీం ఆఫీసర్స్ అయిన స్వాతి లక్రా, అంజలి కుమార్ , స్టీఫెన్ రవీంద్ర, సీవీ ఆనంద్ గార్గ్ లాంటి పోలీస్ అధికారుల నుండి ప్రేరణ పొందినట్లు మంచు లక్ష్మి తెలిపింది. "హైదరాబాద్ లో కొంతమంది అపూరూపమైన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ల డెడికేషన్ కి నేను ఆకర్షితురాలినయ్యాను. ఒక నటిగా నేను పోషిస్తున్న పాత్ర కూడా వాస్తవికంగా ఉండాలని కోరుకున్నానని" తెలిపింది. ఇక ఆ తర్వాత నటిగా, నిర్మాతగా రెండిట్లోనూ తన బాధ్యతను సమానంగా నిర్వహించేందుకు మంచి క్రమశిక్షణతో కూడిన డైలీ రొటీన్ ను తాను ఫాలో అవుతానని చెప్పింది.


ఇందులో భాగంగా ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి అష్టాంగ యోగ సాధనలో నిమగ్నమై నిర్మాతగా రాబోయే రోజు కోసం తన మనస్సు, శరీరాన్ని సిద్ధంగా ఉండేలా చూసుకుంటానని తెలిపింది. ఇక ఈ ప్రయాణంలో తనకు ఎంతో సపోర్టుగా నిలిచిన తన యోగా టీచర్ కి కృతజ్ఞతలు తెలిపింది. యోగ నన్ను సోమరితనం నుంచి బయటపడేసి ఎంతో ప్రశాంతత ఇచ్చింది. యోగా నాకు ఓ మంచి నిర్మాతగా ఉండేందుకు సహాయపడిందని" చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. కాగా వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.


Also Read : పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీకి ఆ టైటిలే కన్ఫార్మ్? ఫ్యాన్స్‌కు పండగే!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial