Kritisanan : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న మూమెంట్ రానే వచ్చింది. మే 9న మేకర్స్ చెప్పినట్టుగానే 'ఆదిపురుష్' ట్రైలర్ ను అధికారికంగా సోషల్ మీడియాలో, పలు థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు ప్రస్తుతానికైతే మంచి రెస్పాన్సే వస్తోంది. అయితే ముంబైలో జరిగిన 'ఆదిపురుష్' ట్రైలర్‌ ఈవెంట్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హీరోయిన్ కృతి సనన్ నేలపై కూర్చుని ట్రైలర్ వీక్షించింది. ఆమె సింప్లిసిటీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' ట్రైలర్ ను మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంఛ్ సందర్భంగా ముంబైలో ఏర్పాటుచేసిన ఈవెంట్ లో ఓం రౌత్, ప్రభాస్ తో పాటు కృతి సనన్ తదితర నటులు పాల్గొన్నారు. అయితే వారు వచ్చేసరికే థియేటర్ కిక్కిరిసిపోయింది. ఆమె కూర్చోడానికి సీటు కూడా దొరకలేదు. దీంతో వెంటనే ఆమె నేలపై కూర్చొంది. ఇది గమనించిన దర్శక నిర్మాతలు వెంటనే పైకి లేచి ఆమెను కూర్చీలో కూర్చోవాలని కోరారు. అయితే, కొందరు దీన్ని పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపడేస్తుంటే మరికొందరు.. ఆమె సింప్లిసిటీని కొనియాడుతున్నారు.






ఇక మే 9న రిలీజైన 'ఆదిపురుష్' ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈ ట్రైలర్ లో శ్రీరాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి అద్భుతంగా కనిపించారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ పై భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో టీజర్ మీద వచ్చిన విమర్శలను తిప్పి కొట్టాలనే ఉద్దేశంతో మేకర్స్.. విజువల్ ఎఫెక్ట్స్ చేంజ్ పై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అలా ఆదిపురుష్ రోజురోజుకూ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే ప్రభాస్ లుక్, కృతి సనన్ పర్పామెన్స్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ అప్పియరెన్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆదిపురుష్ పై భారీ స్థాయిలో హైప్ పెరిగిపోయింది. ఈ సినిమాలోని జై శ్రీరామ్ అంటూ వదిలిన పాట, అందులోని మంత్రంతో ఒక్కసారిగా ఆదిపురుష్‌ అంచనాలు ఆకాశన్నంటాయి. ఇదిలా ఉండగా భారీ బడ్జెట్ తో రూపొందించిన 'ఆదిపురుష్' సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Also Read : 'విరూపాక్ష' విజయంతో సత్యం రాజేష్ రెండో 'పొలిమేర'కు పెరిగిన క్రేజ్!


'ఆదిపురుష్'లో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రమిది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. జూన్ 7 నుంచి 18వ తేదీ వరకు జరిగే ప్రతిష్టాత్మక ట్రిబెకా చలన చిత్రోత్సవాల్లో జూన్ 13వ తేదీన 'ఆదిపురుష్' ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేశారు.