బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ క్రేజ్ గురించి తెలిసిందే. రీసెంట్ గానే 'ఆదిపురుష్' వంటి పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ జోడిగా జానకి దేవి పాత్రలో మంచి నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఆదిపురుష్' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కానీ సినిమాలో జానకి దేవిగా కృతి సనన్ అద్భుతమైన హావభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఒక వైపు సినిమాలతో తెగ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా సరికొత్త వ్యాపారం లోకి అడుగు పెట్టింది.


తాజాగా కృతి సనన్ సొంతంగా ఓ స్కిన్ కేర్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. తన స్కిన్ స్కేర్ బ్రాండ్ కి 'హైఫన్' అనే పేరును ప్రకటిస్తూ స్కిన్ కేర్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇందులో 100% శాకాహార, ప్లాస్టిక్ రహిత పదార్థాలతో ఉత్పత్తులు ఉండబోతున్నాయని తెలిపింది. అంతేకాకుండా తన బ్రాండ్ పెటా ఆమోదం కూడా పొందింది అని తెలిపింది. తన బర్త్‌డే సందర్భంగా స్కిన్ కేర్ బ్రాండ్ లాంచ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ బ్రాండ్ కు సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకుంది కృతి సనన్.


ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కృతి సనన్ పోస్ట్ చేస్తూ.. "ఫైనల్‌గా మీ అందరిని హైఫన్ ప్రపంచానికి స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా అభిరుచి ఈరోజు కలగా మారినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక ఇందులో పవర్ ప్యాక్డ్ ఉత్పత్తులను తయారు చేయాలనేదే నా కల. నా పుట్టినరోజు సందర్భంగా ఈ బ్రాండ్ ని బయటకు తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన హైఫన్ బృందానికి, నా కో ఫౌండర్స్ కి కృతజ్ఞతలు. ఇది నా బర్త్ డే కి ది బెస్ట్ గిఫ్ట్" అంటూ కృతి సనన్ పేర్కొంది. ఇక హైఫన్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే.. వాటి ధర రూ.449 మొదలకుని రూ.649 వరకు ఉంది. ప్రస్తుతం నాలుగు ప్రొడక్ట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


ఇక కృతి సనన్ తన స్కిన్ బ్రాండ్ గురించి చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా బర్త్ డే రోజు కృతి సనన్ సరికొత్త వ్యాపారం లోకి అడుగుపెట్టడంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ ఆమెకు ఈ సందర్భంగా బర్త్డే విషెస్ తో పాటు తన స్కిన్ కేర్ బిజినెస్ సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది 'షెహజాదా', 'ఆదిపురుష్' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి 'గణ్ పత్ పార్ట్ 1' లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అవి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.


Also Read : ధనుష్ మాస్ విధ్వంసం - 'కెప్టెన్ మిల్లర్' టీజర్, ఆ యాక్షన్ మామూలుగా లేవుగా



Join Us on Telegram: https://t.me/abpdesamofficial