Kiran Abbavaram: ఈరోజుల్లో చాలావరకు మేకర్స్.. ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలను రిలీజ్ చేయడానికే మొగ్గుచూపుతున్నారు. హీరో మార్కెట్ ఎలా ఉన్నా కూడా ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుదల చేసే రిస్క్‌ను తీసుకుంటున్నారు నిర్మాతలు. అలాగే టాలీవుడ్ యంగ్ హీరోగా మంచి గుర్తింపు సాధించుకున్న కిరణ్ అబ్బవరం కూడా తన కెరీర్‌లోని మొదటి ప్యాన్ ఇండియా సినిమాకు సిద్ధమయ్యాడు. అదే ‘క’. తాజాగా ‘క’ టీజర్ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఒకరు అతడిని తక్కువ చేసి మాట్లాడుతూ ప్యాన్ ఇండియా సినిమాకు ఎందుకు సిద్ధమయ్యారు అని అడగగా.. దానికి కిరణ్ కూల్‌గా సమాధానమిచ్చాడు.


ఆయన చేయగలరు..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోనే ప్యాన్ ఇండియా చిత్రాలు చేయడం లేదంటూ ఆయనతో పోలిస్తే కిరణ్ అబ్బవరం చాలా చిన్న హీరో అంటూ ‘క’ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో వ్యాఖ్యలు చేశాడు ఒక వ్యక్తి. అలాంటి తనకు తెలుగులోనే సక్సెస్ లేకపోయినా ప్యాన్ ఇండియా సినిమాను ఎందుకు ఎంచుకున్నారని ఓ విలేకరి అడిగాడు. ఆ ప్రశ్నకు కిరణ్ అబ్బవరం చాలా కూల్‌గా రియాక్ట్ అయ్యాడు. ‘‘పవన్ కళ్యాణ్ గారు ప్యాన్ ఇండియా మూవీ చేయాలనుకుంటే తప్పకుండా చేయగలరు. ఒకవేళ ఆయనకు అది ఇంట్రెస్ట్ లేదేమో తెలియదు’’ అంటూ ముందుగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించడంపై స్పందించాడు కిరణ్ అబ్బవరం.


మంజుమ్మెల్ బాయ్స్ ఉదాహరణ..


‘‘స్థాయి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే. మలయాళం నుంచి వచ్చిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ పెద్ద హిట్ చేశాం. అందులో యాక్టర్ల పేర్లు ఎవరికైనా తెలుసా? ‘కాంతార’ విషయంలో కూడా అంతే. ఇక్కడ కంటెంటే ముఖ్యం. నా స్థాయి పెద్దదా, చిన్నదా అనేది తరువాత విషయం. చేసే సినిమాల్లోని కంటెంట్‌కు స్థాయి ఉందా లేదా అన్నదే ముఖ్యం. కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమాను ఎక్కడికో తీసుకెళ్తారు. ‘క’ సినిమాలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని అనుకున్నాం. అంతకు మించి వేరే కారణం లేదు. నాకు తెలిసి నా తరువాత సినిమా కేవలం తెలుగులోనే ఉంటుంది. కావాలని ప్యాన్ ఇండియా అయితే చేయను’’ అని క్లారిటీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.


సక్సెస్ లేదు..


జులై 15న కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా ‘క’ మూవీ టీజర్ విడుదలయ్యింది. టీజర్ చూస్తుంటే ఇదొక పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ అని క్లారిటీ వస్తుంది. ఒకప్పుడు తన సినిమాలతో యూత్‌ను అలరించిన కిరణ్.. గత కొన్నేళ్లుగా ఒక్క సక్సెస్‌ను కూడా చూడలేకపోయాడు. ఇలాంటి సమయంలో తన నుంచి ఒక ప్యాన్ ఇండియా మూవీ వస్తుందంటే ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. కానీ తాను కంటెంట్‌ను నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నానంటూ టీజర్ లాంచ్‌లో చేసిన వ్యాఖ్యలతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. శ్రీ చక్రస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘క’కు సుజీత్, సందీప్.. ఇద్దరూ దర్శకులుగా వ్యవహరించారు.



Also Read: కిరణ్ అబ్బవరం 2.0 - కాంతార రేంజ్‌లో 'క' టీజర్, ఆ విజువల్స్ చూశారా?