ప్రచార చిత్రాలతో, వివాదాలతో సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకు రావడంలో రామ్ గోపాల్ వర్మను మించిన దర్శకుడు, నిర్మాత మరొకరు లేరు. అటువంటి వర్మ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. నిజం చెప్పాలంటే... ఆర్థిక లావాదేవీల కారణంగా ఆయన సినిమా వివాదంలో చిక్కుకుంది. అందుకని, విడుదల వాయిదా వేయడం వేశారనేది కొందరు చెప్పే మాట. అయితే... రామ్ గోపాల్ వర్మ వాయిదా వేయడానికి గల చెప్పిన కారణం మరొకటి. ఏది నిజం? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...


రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా సినిమా 'మా ఇష్టం'. ఏప్రిల్ 8న విడుదల చేయడానికి అంతా రెడీ అయ్యింది. ఈ సమయంలో సినిమాపై నట్టి కుమార్ కేసు వేశారు. వర్మ నుంచి తనకు రావాల్సిన డబ్బులు వచ్చేవరకూ తెలుగులో 'మా ఇష్టం' / హిందీలో 'ఖత్రా' (డేంజరస్) సినిమా విడుదలపై స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అది వచ్చిన కాసేపటికి వర్మ ఒక ట్వీట్ చేశారు. థియేటర్ల నుంచి సహకారం లభించని కారణంగా 'మా ఇష్టం' విడుదల వాయిదా వేస్తున్నామని!


"లెస్బియన్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించిన కారణంగా చాలా థియేటర్లు సహకరించకపోవడంతో 'ఖత్రా డేంజరస్' చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని తెలియజేయడానికి చింతిస్తున్నాను" అని వర్మ ట్వీట్ చేశారు. నిజానికి, ఈ సినిమాను తమ మల్టీప్లెక్స్ స్క్రీన్స్‌లో ప్రదర్శించడం లేదని, బ్యాన్ చేస్తున్నామని ఐనాక్స్, పీవీఆర్ సంస్థలు ముందే చెప్పారు.






రామ్ గోపాల్ వర్మ బుధవారం రాత్రి జరిగిన 'మా ఇష్టం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో "కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ 'మా ఇష్టం' సినిమాను ప్రదర్శించడం లేదని చెప్పడంతో బాధ పడ్డాను. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. సినిమా తీసే విషయంలో, విడుదల విషయంలో నన్ను అడ్డుకోవడం బ్రహ్మ తరం కూడా కాదు ఖబడ్దార్!" అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరుసటి రోజుకు ఆయన వెర్షన్ మారింది.  అందువల్ల, కోర్టు ఆర్డర్ రావడంతో వర్మ భయపడ్డారని ఇండస్ట్రీ జనాలు వ్యాఖ్యానిస్తున్నారు. అదీ సంగతి!


Also Read: 'మా ఇష్టం' విడుదల చేయడానికి వీల్లేదు - కోర్టు స్టే ఆర్డర్


నైనా గంగూలీ, అప్సరా రాణీ ప్రధాన తారలుగా క్రైమ్  నేపథ్యంలో లెస్బియన్ లవ్ స్టోరీగా 'మా ఇష్టం'చిత్రాన్ని తెరకెక్కించారు.


Also Read: హిందీ సినిమా ఎందుకు? బాలీవుడ్ జనాలకు దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చిన మహేష్!