Actor Kartikeya: యంగ్ హీరో కార్తికేయ ఇటీవల ‘భజే వాయు వేగం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ చాలామంది ఆడియన్స్‌ను ఆకట్టుకొని పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అయినా కూడా మూవీని ఎక్కువమందికి రీచ్ అయ్యేలా చేయాలని ప్రమోషన్స్ మాత్రం ఆపలేదు కార్తికేయ. తాజాగా కొందరు యూత్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అలా ‘భజే వాయు వేగం’ గురించి మరెన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సినిమాలో తను డ్రైవ్ చేసింది ప్రభాస్ కార్ అని బయటపెట్టాడు.


అప్పుడు గుర్తురాలేదు..


‘భజే వాయు వేగం’ సినిమాతో డైరెక్టర్‌గా ప్రశాంత్ రెడ్డి డెబ్యూ చేశాడు. యూవీ క్రియేషన్స్.. ఈ సినిమాను నిర్మించింది. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మాతలు.. ప్రభాస్‌కు సన్నిహితులు కావడంతో ‘భజే వాయు వేగం’లో ముఖ్యమైన ఛేజ్ సీక్వెన్స్ కోసం ప్రభాస్ కారును తీసుకొచ్చారు. ఆ విషయాన్ని తాజాగా బయటపెట్టిన కార్తికేయ.. దానిని డ్రైవ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కూడా అందరితో షేర్ చేసుకున్నాడు. ‘‘నేను మూవీలో నడిపింది ప్రభాస్ గారి కారే. ఆయన కారే మేము సినిమాలో ఉపయోగించామనేది ఒక మంచి ఫీలింగ్’’ అని చెప్పుకొచ్చాడు కార్తికేయ.


మనసు రాలేదు..


కార్తికేయకు హీరోగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. అయితే ఇప్పటికీ ఆ ఆర్ఎక్స్ 100 బైక్ తన దగ్గరే ఉందని కార్తికేయ పలుమార్లు బయటపెట్టాడు. దానికి ఏదైనా పోటీ పెట్టి.. ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌గా ఇవ్వచ్చు కదా అని తనకు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘ఒకసారి అదే అనుకున్నాను. దానిని వేలానికి కూడా పెట్టాను. వేలంపాటలో రూ.2 లక్షలు పాడారు. ఆ డబ్బు తీసుకొని కేరళలో వరద బాధితులకు ఇచ్చేద్దామనుకున్నా. కానీ చివరి నిమిషంలో బైక్ ఇచ్చేయడానికి నాకు మనసు రాలేదు. అందుకే అదే వేలంపాటలో నేను రూ.2.5 లక్షలకు పాడి నా జేబు నుండి డబ్బుతో నా బైక్ నేనే తీసుకొని ఉంచేసుకున్నాను’’ అని బయటపెట్టాడు కార్తికేయ.


భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాలు..


ఇక ఈరోజుల్లో యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు అంటూ తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఉద్దేశ్యం కార్తికేయకు ఉందా అని అడగగా.. ముందుగా తను తెలుగు ఆడియన్స్‌కు దగ్గర అవ్వాలనుకుంటున్నానని, తెలుగులో మార్కెట్ పెరిగిన తర్వాత భవిష్యత్తులో కచ్చితంగా పాన్ ఇండియా చిత్రాలు ట్రై చేస్తానని తెలిపాడు. ఇక ‘భజే వాయు వేగం’ కోసం క్రికెట్ నేర్చుకున్న కార్తికేయ.. బ్యాటింగ్, బౌలింగ్‌లో బ్యాటింగ్ అంటేనే ఎక్కువ ఇష్టం అని బయటపెట్టాడు. బౌలింగ్‌కు చాలా ప్రాక్టీస్ కావాలని, అది చాలా కష్టమని, ఒకట్రెండు సార్లు ట్రై చేసి పక్కన పెట్టేశానని చెప్పి నవ్వాడు కార్తికేయ. ఆర్సీబీ గురించి ఒక్క మాట చెప్పమని అడగగా.. ‘‘నెక్స్‌ట్ సాలా కప్ నమ్దే’’ అన్నాడు ఈ యంగ్ హీరో.


Also Read: భజే వాయు వేగం రివ్యూ: కార్తికేయ హిట్టు కొట్టాడా? యూవీ కాన్సెప్ట్స్ సినిమా ఎలా ఉందంటే?